అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆరంభంలోనే భారీ లాభాలను నమోదు చేసిన సూచీలు.. భారత్-చైనా సరిహద్దుల్లో వివాదం కారణంగా కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. చివరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 376 పాయింట్లు బలపడి 33,605 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 9,914 వద్ద స్థిరపడింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ రాణించడం కూడా దేశీయ సూచీలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,022 పాయింట్ల అత్యధిక స్థాయి, 32,953 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,046 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 9,728 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్ షేర్లు ముఖ్యంగా లాభపడ్డాయి.
టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 17 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.76.20 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:జియోలో మరో రూ.11 వేల కోట్ల విదేశీ పెట్టుబడి!