అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ముకేశ్ అంబానీ సహా ఆయన కుటుంబానికి జడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. వ్యక్తులకు ఉన్న భద్రతా ముప్పును మదింపు చేసి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
2019 డిసెంబర్లో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ హిమాన్షూ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
తమకు ముప్పు ఉందని భావించి భద్రతా ఖర్చులను భరించాలనుకున్న వ్యక్తులకు జడ్ ప్లస్ రక్షణ కల్పించడం రాష్ట్రాల నిర్ణయమని బాంబే హైకోర్టు అప్పట్లో తీర్పు వెల్లడించింది. అంబానీ కుటుంబం ఈ వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఇలాంటి వ్యక్తులకు అత్యుత్తమ భద్రత కల్పించడం సహా ముంబయి పోలీసు కమిషనర్‌కు మరో మార్గం లేదని వ్యాఖ్యానించింది.