సంక్షోభంలో చిక్కుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెక్ లిమిటెడ్ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సంస్థ నిర్వహణ బాధ్యతలు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.
నూతన విధివిధానాలు రూపొందించేందుకు యునిటెక్ కొత్త బోర్డుకు జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మసనం రెండు నెలల గడువునిచ్చింది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించనున్నట్లు వెల్లడించింది.
సంస్థ యాజమాన్యంపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా కొత్త బోర్డుకు రెండు నెలల తాత్కాలిక నిషేధం(మోరటోరియం) విధించింది ధర్మాసనం.
కేంద్రం అభ్యర్థన
సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని 2017లో తాము చేసిన ప్రతిపాదనను పునఃసమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని శనివారం అభ్యర్థించింది కేంద్రం. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి 12 వేల మంది కొనుగోలుదారులకు ఉపశమనం కల్పించేలా ఆదేశించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ స్థానంలో 10 మంది డైరెక్టర్లను ప్రభుత్వ నామినీలుగా నియమించాలని కోరింది.
అయితే సంస్థ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి నిధులు కేటాయించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'ప్రధాని.. బడా మిత్రులకు పేదల సొమ్ము బట్వాడా'