ఆరు నెలల్లోనే తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. కూరగాయలు చౌక అవ్వడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.58 శాతంగా నమోదైంది. అయితే ఇప్పటికీ ఇది ఆర్‌బీఐ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ నియంత్రిత లక్ష్యం కంటే ఎక్కువే. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కిస్తారు. ఈ ఏడాది జనవరిలో ఇది 7.59 శాతంగా ఉండగా.. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతంగా నమోదైంది. 2019 ఆగస్టు నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండగా.. ఫిబ్రవరిలో దిగిరావడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన వివరాలు ఇలా..
- కూరగాయల ధరల్లో జనవరిలో 50.19 శాతం పెరుగుదల ఉండగా.. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ రేటు గణనీయంగా 31.61 శాతానికి దిగివచ్చింది. .
- ప్రోటీన్ ఆధారిత ఉత్పత్తులైన మాంసం, చేపల ద్రవ్యోల్బణ రేటు 10.2 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 10.5 శాతంగా ఉంది. గుడ్లు కూడా చౌక అయ్యాయి.
- ఆహార పదర్థాలు ధరల ద్రవ్యోల్బణ రేటు 10.81 శాతానికి తగ్గింది. జనవరిలో ఆహార పదార్థాల ధరల్లో 13.63 శాతం పెరుగుదల ఉంది.
- ఇంధనం, విద్యుత్ విభాగాల ద్రవ్యోల్బణ రేటు రెట్టింపై 6.36 శాతంగా నమోదైంది.
తగ్గిన కరెంటు ఖాతా లోటు
అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో దేశ కరెంటు ఖాతా లోటు గణనీయంగా తగ్గి 1.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జీడీపీలో ఈ విలువ 0.2 శాతం. వాణిజ్య లోటు 34.6 బిలియన్ డాలర్లకు దిగిరావడం ఇందుకు కారణమైంది.
ఇదీ చదవండి: ఎస్ బ్యాంకులో ఎస్బీఐ పెట్టుబడి రూ.7,250 కోట్లు