రిలయన్స్ రిటైల్ చేతికి కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలు దక్కనున్నాయి. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)ల మధ్య ఆ మేరకు నేడు ఒక ఒప్పందం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే భారత రిటైల్ రంగంలో రిలయన్స్ రిటైల్ వాటా భారీ ఎత్తున పెరగనుంది.
ముకేశ్ అంబానీ-కిశోర్ బియానీలు జట్టు కట్టే సమయం వచ్చేసింది. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌ల మధ్య ఒప్పందానికి నేడు జరిగే బోర్డు సమావేశంలో ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ అంగీకారం తెలపవచ్ఛు మొత్తం నగదులో జరిగే ఈ ఒప్పందంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రుణాలన్నీ రిలయన్స్ రిటైల్‌కు వెళతాయి. అదే సమయంలో అందులో మైనారిటీ వాటా కూడా రిలయన్స్ రిటైల్‌కు వస్తుంది.
ఇదీ ఒప్పందం..
ఫ్యూచర్ గ్రూప్ తొలుత తన అయిదు యూనిట్లయిన నిత్యావసరాలు, దుస్తులు, సరఫరా వ్యవస్థ, వినియోగదారు వ్యాపారాలను.. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్(ఎఫ్‌ఈఎల్)లో విలీనం చేస్తుంది. ఆ తర్వాత ఎఫ్‌ఈఎల్ అన్ని రిటైల్ ఆస్తులను ఏకమొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తుందని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. మొత్తం లావాదేవీ విలువ రూ.29,000-30,000 కోట్లుగా ఉండొచ్చని చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్‌కు దుస్తులు, నిత్యావసరాలను దీర్ఘకాలం పాటు సరఫరా చేసే ఒప్పందాన్ని కూడా ఎఫ్‌ఈఎల్ కుదుర్చుకోవచ్ఛు
ఫ్యూచర్ గ్రూప్ ఎందుకు అమ్మాల్సి వస్తోందంటే..
ఈ ఒప్పందం ద్వారా తనకున్న భారీ అప్పుల నుంచి బయటపడాలని ఫ్యూచర్ గ్రూప్ భావిస్తోంది. మార్చి 31, 2019 నాటికి రూ.10,951 కోట్లుగా ఉన్న కంపెనీ అప్పులు సెప్టెంబరు 30, 2019నాటికే రూ.12,778 కోట్లకు చేరుకున్నాయి. ఈ మార్చి కల్లా కొన్ని బకాయిలను తీర్చాల్సి ఉంది. అయితే ఆర్‌బీఐ మారటోరియం కొంత ఊపిరినిచ్చింది. ఫిబ్రవరి నుంచే గ్రూప్ కంపెనీలు రుణాన్ని తీర్చలేని పరిస్థితికి వచ్చాయి. దీంతో బియానీకిచ్చిన రుణాలకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాలని రుణదాతలు ఒత్తిడి పెంచారు. ఆలోచనల పుట్టగా పేరున్న బియానీ.. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో విఫలం కావడంతో పాంటలూన్ రిటైల్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు; ఫ్యూచర్ క్యాపిటల్‌ను వార్‌బర్గ్ పింకస్‌కు విక్రయించుకోవాల్సి వచ్చింది. ఇపుడూ రుణాలు తీర్చడానికే ఈ విక్రయం.
రిలయన్స్‌కు ఏమిటి లాభం..
ఎప్పటినుంచో రిటైల్‌రంగంలో మార్కెట్ లీడర్‌గా మారాలన్న రిలయన్స్ కల ఈ ఒప్పందంతో నెరవేరుతుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్ రిటైల్‌కు ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ద్వారా భారత్‌లోని సంస్థాగత రిటైల్ మార్కెట్లో మూడో వంతు కంటే అధిక మార్కెట్ వాటా లభిస్తుంది. అంతేకాదు పోటీదార్లపై గట్టి ఒత్తిడిని పెంచవచ్ఛు ముఖ్యంగా అమెరికాకు చెందిన అమెజాన్ ఇండియాకు ఇ-కామర్స్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వవచ్చు.