Reliance Family Day 2021: రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ ఛైర్మన్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ తొలిసారిగా పేర్కొన్నారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీకి సంబంధించిన వారసత్వ ప్రణాళికలపై ఇప్పటివరకు నోరువిప్పని ముకేశ్ అంబానీ(64) మొదటిసారిగా 'ఇకపై నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేస్తామ'ని అనడం విశేషం. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు.
ముకేశ్‌తో పాటు.. ఇతర సీనియర్లూ..
గ్రూప్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే 'రిలయన్స్ ఫ్యామిలీ డే'లో ఆయన మాట్లాడుతూ 'రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బహుళ జాతి కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది. తాజాగా అడుగుపెడుతున్న స్వచ్ఛ, హరిత ఇంధన రంగంతో పాటు రిటైల్, టెలికాం వ్యాపారాలు అందుకు దోహదం చేస్తాయి. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యం. రిలయన్స్ ఇపుడు ఆ అత్యంత ముఖ్యమైన నాయకత్వ మార్పు ప్రక్రియలో ఉంది. ఆ మార్పు నాతో పాటు, నాతరం సీనియర్ వ్యక్తుల నుంచి తదుపరి తరం అయిన యువ నాయకులకు జరుగుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నాను' అని అన్నారు.
మనవడి పేరునూ ప్రస్తావించారు..
'అందరు సీనియర్లు..నాతో సహా.. ఇపుడు మాతో అత్యంత పోటీనిచ్చే, అత్యంత కట్టుబడి ఉండే యువ నాయకత్వానికి పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేం వారికి మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉంది. వారిని ప్రోత్సహించాలి.. వారికి సాధికారికత అందించాల'ని అందులో పేర్కొన్నారు. 'ఆకాశ్, ఈశా, అనంత్‌లపై నాకు ఎటువంటి అనుమానమూ లేదు. తదుపరి తరం నాయకులుగా వారు రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు. వారిలో ఆ ప్రతిభ, శక్తి ఉంది' అని తన వారసులపై ధీమా వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రారంభంలో ఈశా భర్త ఆనంద్ పిరమాల్, ఆకాశ్ భార్య శ్లోక, రాధిక(అనంత్ కాబోయే భార్య అని ప్రచారం ఉంది), పృథ్వి(ఆకాశ్, శ్లోకల కుమారుడు)ల గురించి కూడా అంబానీ ప్రస్తావించారు.
మరిన్ని హైబ్రిడ్, వర్చువల్ పని విధానాలు..
భవిష్యత్‌లో ప్రపంచంలోనే తొలి మూడు ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలబడగలదని అంచనా వేశారు. ఇపుడు తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ.. ఇంకా అనిశ్చితులున్నందున నిర్లక్ష్యం కూడదని.. ఆరోగ్య భద్రత ముఖ్యమని ముకేశ్ అన్నారు. కరోనా మనకు ఆరోగ్యమే మహాభాగ్యమని, కుటుంబానికే తొలి ప్రాధాన్యత అని తెలిసేలా చేసిందన్నారు. కరోనా సమయంలో కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపామని.. భవిష్యత్‌లో సాంకేతికత మరింత సౌకర్యవంతమైన హైబ్రిడ్, వర్చువల్ పని విధానాలను అందజేస్తుందని అంబానీ అన్నారు.
ఇదీ చూడండి : Taxpayer Complaints: ఐటీ రిటర్న్‌ల గడువు పెంచండి..!