కేంద్ర బడ్జెట్‌కు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ) నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ సమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
"ఆహార ధరల పతనం కారణంగా ద్రవ్యోల్బణం తగ్గినా.. మూల ద్రవ్యోల్బణంలో మార్పు లేదు. వడ్డీరేట్ల పెంపులో విరామం కొనసాగిస్తేనే మేలు. టీకా పంపిణీతో స్థూల ఆర్థిక వ్యవస్థ వెంటనే పుంజుకోదు. ద్రవ్య లభ్యతను పెంచాల్సిన అవసరం ఉంది."
- ఎం గోవిందరావు, బ్రిక్ వర్క్ రేటింగ్స్
మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమీక్ష ఫిబ్రవరి 3న ప్రారంభం కానుంది. ఆరుగురు సభ్యులున్న ద్రవ్య విధాన కమిటీకి ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహిస్తారు. ఫిబ్రవరి 5న సమావేశ నిర్ణయాలను ప్రకటించనుంది ఆర్బీఐ.
ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. రెపో రేటుకు పెంపునకు మరింత సమయం ఉంటుందని భావిస్తున్నా. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న వార్తలపై ఒక అంచనాకు రావాల్సి ఉంది. ఎంపీసీ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
-అదితి నాయర్, ఇక్రా లిమిటెడ్.
గత సమీక్షలో..
చివరిగా మే 22న సమావేశమైన ఎంపీసీ.. డిమాండ్‌ను పెంచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీ రేట్లను జీవనకాల కనిష్ఠానికి తగ్గించింది. అదే విధంగా గత ఫిబ్రవరి నుంచి రెపో రేట్లలో 115 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 4శాతంగా ఉంది.
ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చేలా ద్రవ్య పరపతి విధానం ఉండాల్సిన అవసరం ఉంది. పాలసీ రేట్లలో యథాతథ స్థితి కొనసాగుతుందని ఆశిస్తున్నా. గత డిసెంబర్‌లో వినియోగదారు ద్రవ్యల్బణం ప్రభావితం అయింది.
-సునీల్ కుమార్ సింఘా, ఇండియా రేటింగ్స్
ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ తన వైఖరి కొనసాగిస్తుందని అనుకుంటున్నా. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరం.
-మయూర్ మోదీ, మనీబాక్స్ ఫైనాన్స్.
పాలసీ రేట్ల సవరణకు ఆర్‌బీఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 2020 డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.59 శాతానికి పైగా పడిపోయింది. గత నవంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 6.93 శాతంగా ఉంది. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కనీసం 4శాతానికి అటూఇటుగా ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి: బడ్జెట్ 2020-21: ఎన్నో ఆశలు.. మరెన్నో సవాళ్లు