కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం బ్యాలెన్స్ షీట్, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీపై ఎంత మేర ఉందో అంచనా వేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కోరింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పేమెంట్ బ్యాంకులు సమన్వయ వ్యూహం అనుసరించాల్సిన అవసరముందని పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేపట్టాల్సిన చర్యలపై ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. తమ ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
"ఆర్థిక మార్కెట్లు, సంస్థలు పుంజుకునేందుకు గత కొద్ది రోజులుగా ఆర్బీఐ తగు చర్యలు తీసుకుంటోంది. భారతీయ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ పలు పాలసీ విధానాలను అవలంబిస్తోంది. అసరమైన పాలసీ విధానాలను సమయానుగుణంగా వినియోగిస్తాం. "
- శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
క్విక్ రెస్పాన్స్ టీమ్..
ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గవర్నర్. దీని కోసం క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ)ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కాలానుగుణంగా జరుగుతున్న పరిణామాలపై ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తుందని వెల్లడించారు.
వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం..
వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ సంకేతాలిచ్చింది. ద్రవ్య లభ్యత పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు దాస్. అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సహా 43 కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో.. ఆర్బీఐ గవర్నర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈనెల 23న విదేశీ మారక మార్కెట్లలో ద్రవ్య లభ్యత కోసం రెండు బిలియన్ డాలర్లను విక్రయించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఎస్ బ్యాంకు ఖాతాదారుల డబ్బు భద్రం: ఆర్బీఐ