దాదాపు 200 సంవత్సరాల క్రితం బ్రిటన్ హయాంలో ఏర్పాటైన టంకశాల అది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వ టంకశాలగా మారింది. రూ.1, 2, 5 నాణేలతో పాటు ఎన్నో రకాల మెడల్స్, జ్ఞాపికలు, బంగారు- వెండి నాణేలు ఉత్పత్తి చేసే ఎంతో ప్రతిష్ఠాత్మక సంస్థ కూడా.. అదే భారత ప్రభుత్వ మింట్- ముంబయి(ఐజీఎం). దీనికి నేతృత్వం వహించే అరుదైన అవకాశాన్ని తెలుగుతేజం వి.ఎన్.ఆర్.నాయుడు దక్కించుకున్నారు. ఆయన ఈ నెల 9న ఐజీఎం చీఫ్ జనరల్ మేనేజర్‌గా(సీజీఎం) బాధ్యతలు చేపట్టారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్(ఐఓఎఫ్‌ఎస్) అధికారిగా ఎంపికై, 50 ఏళ్ల వయస్సులో ఐజీఎం- సీజీఎం స్థాయికి ఎదిగిన వి.ఎన్.ఆర్.నాయుడుది పూర్తిగా గ్రామీణ నేపథ్యం.
తాడికొండ స్కూల్ పూర్వ విద్యార్థి
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం నాయుడు స్వగ్రామం. తల్లితండ్రులు భాస్కరమ్మ, వెంకటేశ్వరరావు. గుంటూరు జిల్లాలోని తాడికొండ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి, నందిగామ కేవీఆర్ కాలేజీలో ఇంటర్, ఆర్‌ఈసీ- వరంగల్‌లో బీటెక్ (మెటలర్జికల్ ఇంజనీరింగ్) అభ్యసించారు. 1993 నుంచి 2000 సంవత్సరం వరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఫౌండ్రీలు, కాస్టింగ్స్ ఉత్పత్తుల కంపెనీల్లో పనిచేశారు. ఈ అనుభవంతో యూపీఎస్‌ఈ ద్వారా భారత ప్రభుత్వ ఐఓఎఫ్‌ఎస్ 1999 బ్యాచ్ అధికారిగా ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్. అక్కడే 2017 వరకూ పనిచేశారు. జాయింట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.
క్లిష్టమైన విడిభాగాల రూపకల్పనలో
భారత సైన్యానికి వెన్నెముకగా ఉన్న టీ-90 భీష్మ, టీ-72 అజేయ, సారథ్ ట్యాంకుల్లో వినియోగించే ఎన్నో క్లిష్టమైన విడిభాగాలను సొంతంగా అభివృద్ధి చేశారు. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల్లో వినియోగించే ఏకే-630-ఎం తుపాకీకి అవసరమైన 16 ముఖ్యమైన విడిభాగాలను మనదేశం సొంతంగా అభివృద్ధి చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ తుపాకీ నిమిషానికి 3,600 రౌండ్లు పేల్చగలదు. ఈ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2012లో ‘ఆయుధ్ భూషణ్’ అవార్డు ఇచ్చి సత్కరించింది. తాజాగా భారత ప్రభుత్వ టంకశాల- ముంబయి సీజీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.
అంతర్జాతీయ గుర్తింపు కోసం
ఈ సందర్భంగా ఆయన 'ఈనాడు' తో మాట్లాడుతూ తన ప్రగతి ప్రస్థానంలో తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, భార్య విజయలక్ష్మి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఇతర దేశాల నాణేలు కూడా ముద్రించేందుకు సాధనా సంపత్తి సమకూర్చుకోవడం, విదేశీ కాంట్రాక్టులు దక్కించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. లండన్ బులియన్ అసోసియేషన్(ఎల్‌బీఏ) నుంచి ముంబయి టంకశాలకు ధ్రువీకరణ సంపాదించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీని వల్ల ముంబయి టంకశాల ముద్రించే బంగారు నాణేలకు అంతర్జాతీయ గుర్తింపు, అధిక ధర లభిస్తాయని వి.ఎన్.ఆర్.నాయుడు పేర్కొన్నారు. దీన్ని సాధించాలంటే ఏడాదికి 30 టన్నుల బంగారాన్ని, మూడేళ్ల పాటు కరిగించిన అనుభవం ఉండాలి.
దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టీటీడీకి భక్తులు ఇచ్చే బంగారు కానుకలను కరిగించి, డాలర్లుగా ముద్రించే పని ఇప్పటికే ముంబయి టంకశాల చేస్తోంది.
ఇదీ చదవండి: RBI New Guidelines: కార్డు వివరాలు గుర్తున్నాయా? లేదంటే అంతే!