భారతీయ ఉద్యోగుల్లో తమ ఆదాయం, పొదుపులు పెరుగుతాయనే విశ్వాసం పెరిగినట్ల తెలిసింది. వచ్చే ఆరు నెలల్లో ఆదాయంతో పాటు వ్యక్తిగత అవసరాలకు ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నట్లు లింక్డ్ ఇన్ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 1,351 మందిపై జూన్ 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించింది లింక్‌డ్‌ఇన్. ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థికస్థితిపై దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఇంతకు ముందు మేలో చేసిన సర్వేతో పోలిస్తే ఉద్యోగుల్లో భద్రతాభావం కూడా మెరుగైనట్లు వెల్లడించింది.
అప్పుడలా.. ఇప్పుడిలా..
మే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేసిన సర్వేలో 1,646 మంది పాల్గొనగా 20శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. 27శాతం మంది మిగులు, 23శాతం మంది ఖర్చులు పెరుగుతాయని తెలిపారు. ఈ మధ్యే జరిపిన సర్వేలో ముగ్గురిలో ఒకరు తమ వ్యక్తిగత మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపులు పెరుగుతాయని తెలిపినట్లు లింక్‌డ్‌ఇన్ ఉద్యోగుల ఆత్మవిశ్వాస సూచీలో తేలింది.
యాజమాన్యాల విశ్వాసం..
స్వల్పకాల యాజమాన్య విశ్వాసం విషయానికి వస్తే 50శాతం కార్పొరేట్ సేవలు, 46శాతం తయారీ రంగ, 41శాతం విద్యారంగ ప్రొఫెషనల్స్ తమ కంపెనీలు రాబోయే ఆరునెలల్లో మెరుగవుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాల యాజమాన్య ఆత్మవిశ్వాసం ప్రకారం.. 64శాతం తయారీరంగ, 60శాతం కార్పొరేట్ సేవలు, 59శాతం సాఫ్ట్‌వేర్, ఐటీ ప్రొఫెషనల్స్ ఏడాది కాలంలో తమ సంస్థలు మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇంటి నుంచి పనికే యువత మొగ్గు..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా 38శాతం జెన్ ఎక్స్ (40-54 వయసు), 29శాతం బేబీ బూమర్స్ (55+ వయసు) అనుమతిస్తే కంపెనీలకు వచ్చి పనిచేయాలని భావిస్తున్నారు. జెన్ జెడ్ (25 కన్నా తక్కువ వయసు), మిలినియల్స్ (25-39 వయసు)లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటి నుంచే పనిచేయడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రయాణం, భోజనం సమయంలో నిర్లక్ష్యంగా ఉండే కొందరితో ప్రమాదముందని 55% మంది అంటున్నారు.
ఇదీ చూడండి: 'పెట్టుబడుల పేరుతో 'చైనా దొంగాట'పై దర్యాప్తు!'