పొరుగు దేశం పాకిస్థాన్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో అతిపెద్ద నగరం కరాచీలో కిలో టమాటా ధర రూ.400 దాటింది.
భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం.. భారత్ నుంచి దిగుమతులపై విధించిన ఆంక్షలు.. టమాటా ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమని స్థానిక మీడియా పేర్కొంది.
ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నా..
ఇరాన్ నుంచి 4,500 టన్నుల టమాటా దిగుమతికి పాక్ ప్రభుత్వం గత వారం అనుమతినిచ్చింది. వాటి రాక మార్కెట్లో డిమాండుని తీర్చలేకపోయింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నట్లు స్థానికులు అంటున్నారు.
అయితే ఇరాన్ నుంచి మొత్తం 4,500 టన్నుల్లో ఇప్పటి వరకు.. 989 టన్నుల టమాటా మాత్రమే పాక్కు చేరుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కిలో టమాటాకు గతవారం ఉన్న రూ.300 నుంచి ఒక్క సారిగా రూ.400కు పెరగటం చూసి.. కరాచీ ప్రజలు కంగుతిన్నారు.
ఏరికోరి కష్టాలు..
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్తో వ్యాపార సంబంధాలను తెంచుకుంది పాకిస్థాన్. ఫలితంగా భారత్ నుంచి పాక్కు టమాటా దిగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది.
ఇదీ చూడండి:త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం!