మహిళల ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్.. లాభాపేక్షలేని సామాజిక సంఘాలకు 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత్లో 10 లక్షల గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'గూగుల్ సాతి' కార్యక్రమం ద్వారా సాయం చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు.
'కరోనా మహమ్మారి సమయంలో మహిళలు తమ ఉద్యోగం కోల్పోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువైంది. దాదాపు 2 కోట్ల మంది బాలికలు పాఠశాలలకు తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు సమానమైన భవిష్యత్ నిర్మించే అవకాశం మాకుంది. దీనిని మేము కచ్చితంగా అందిపుచ్చుకుంటాం.' అని గూగుల్ ఫర్ ఇండియా పేరుతో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో పని చేసే లక్ష మంది మహిళలకు డిజిటల్, ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు నాస్కామ్కు 5 లక్షల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా గూగుల్ ప్రకటించింది.