కరోనా వైరస్‌పై పోరులో భారత దేశం ఐకమత్యంతో ముందుకు సాగుతోంది. వైద్యులు, నర్సులతో పాటు వివిధ విభాగాలకు చెందిన వారు.. తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశం కోసం పోరాడుతున్నారు. వారిలో ఇండియన్ ఆయిల్ కార్ప్(ఐఓసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ ఒకరు. తన తండ్రిని కోల్పోయిన 24 గంటల్లోనే తిరిగి పనిలో పడ్డారు ఆయన.
చమురు కొరత రాకుండా...
దేశంలోనే అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్ప్‌లో సంజీవ్ సింగ్ రిఫైనరీ ఆపరేషన్స్‌తో పాటు సరఫరానూ పర్యవేక్షిస్తున్నారు. వైరస్‌పై యుద్ధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన రోజే(మార్చి 24) సింగ్ తండ్రి(89 ఏళ్లు) కన్నుమూశారు. అది జరిగిన 24 గంటల్లోనే పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టి.. దేశంలో ఎక్కడా చమురు కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంజీవ్. ఇందుకోసం ఆయన తల్లిదండ్రుల నివాసాన్నే ఓ వార్ రూమ్‌గా మార్చుకుని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాలనూ పర్యవేక్షిస్తున్నారు.
"మా నాన్న లఖ్‌నవూలో ఉంటారు. మార్చి 24న ఆయన ఆరోగ్యం విషమించింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే నేను నా భార్యతో కలిసి లఖ్‌నవూ బయలుదేరాను. కానీ ఆయన మరణించారని.. దారి మధ్యలో తెలిసింది. ఆయన మరణం.. నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. అయితే ప్రస్తుతం నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను అంతే. కానీ బయట కొన్ని వేల మంది సిబ్బంది.. తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ దేశంలో ఎక్కడా చమురు కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఈ దేశం పట్ల మాకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతనే మేము నిర్వర్తిస్తున్నాం."
--- సంజీవ్ సింగ్, ఐఓసీ ఛైర్మన్.
డిపోల నుంచి పంపుల వరకు చమురు సరఫరా చేస్తున్న డ్రైవర్లు, ఎల్పీజీ సరఫరా ఏజెన్సీల్లోని సిబ్బందికి ఐఓసీ ఉచితంగా ఆహార పొట్లాలు అందజేస్తోంది. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీల్లోని సిబ్బందికి రూ.5 లక్షలు జీవిత బీమా అందిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆరోగ్య బీమా పథకాలనూ అమలు చేయాలని భావిస్తోంది.