పదవీ విరమణ తర్వాత ఆదాయం రావడం ఆగిపోతుంది. మరి వయసు పైబడే కొద్ది వచ్చే అనారోగ్య సమస్యలు, రోజువారి ఖర్చులను అదిగమించి అప్పుడు కూడా రెగ్యులర్‌గా ఆదాయం పొందుతూ సంతోషమైన జీవనాన్ని కొనసాగించేందుకు వయసులో ఉన్నప్పటినుంచే ప్రణాళికను ప్రారంభించాలి. యవ్వనంలో ఉన్నప్పుడే పెట్టుబడులు అనే మొక్కను నాటితో పదవీ విరమణ సమయానికి అది పెరిగి పెద్దదై మంచి అందిస్తుంది. పెట్టుబడులుకు చాలా రకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మరి మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్, లిక్విడిటీని బట్టి ఏది ఎంచుకుంటారన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఆర్థిక సలహాదారుని సూచనలతో సరైన పెట్టుబడుల మార్గాన్ని ఎంచుకుంటే పదివీ విరమణ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చు.
పదవీ విరమణ కోసం పెట్టుబడులను ఎప్పటినుంచి ప్రారంభించాలి?
పెట్టుబడిదారుడి సంపాదన, రిస్క్‌ను దృష్టిలో పెట్టుకొని ఏ వయసులో పెట్టుబడిన ప్రారంభించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎంత చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే దీర్ఘకాలానికి ప్రయోజనాలను పొందవచ్చు. యుక్త వయసులో ఉన్నప్పుడే పెట్టుబడులు ప్రారంభిస్తే రిస్క్ ఎక్కువ తీసుకున్నా ఫర్వాలేదు. పదవీ విరమణ సమయం దగ్గరపడుతున్నా కొద్ది రిస్క్‌ను తగ్గిస్తుండాలి. రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్నవారు ఎక్కువ శాతం డెట్ ఫండ్లకు కేటాయించడం మేలు. పదవీ విరమణ తర్వాత రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందేందుకు పెట్టుబడుడలకు 10 మార్గాలు:
1.ఫిక్స్‌డ్ డిపాజిట్లు
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు కచ్చితమైన రాబడిని అందిస్తాయి. పదవీ విరమణ కోసం డబ్బు దాచుకోవాలనుకుంటున్న వారికి ఇది సరైన ఆప్షన్. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్‌లు,కంపెనీలు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తాయి. అయితే కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబడిపై ఎలాంటి హామీ ఉండదు.
2.సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్)
సీనియర్ సిటజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్) లో పెట్టుబడులు కేవలం 60 ఏళ్ల తర్వాతనే ప్రారంభించాలి. వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ కింద పదవీ విరమణ తీసుకున్నవారు 55 సంవత్సరాల నుంచే ప్రారంభించవచ్చు. ఒకరు లేదా ఉమ్మడిగా ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీ కింద దీనిపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దీనిపై వడ్డీ రేట్లు 8.7 శాతంగా ఉండనున్నాయి.
3.పోస్టాఫీస్ నెలవారి ఆదాయ స్కీమ్ (ఎంఐఎస్)
అక్టోబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో 7.7 శాతం వడ్డీ లభించనుంది. దీనికి మెచ్యూరిటీ గడువు 5 సంవత్సరాలు. వ్యక్తిగత ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే రూ.9 లక్షలు పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే దీనిపై పన్ను రేట్లు వర్తిస్తాయి.
4.నెలవారి ఆదాయ ప్రణాళికలు (ఎంఐపీ)
ఎంఐపీ పెట్టుబడులు ఎక్కువగా డెట్ ఫండ్లలోకి చేరతాయి. పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు పదవీవిరమణ పొందేవారికి ఇది సరైన ఆప్షన్. రిస్క్ తక్కువగా ఉండటంతో పాటు లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా డివిడెండ్లను అందిస్తుంది. ఎవరైతే తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సుక్షితంగా దాచుకొని నెలవారిగా కొంత ఆదాయం పొందాలనుకుంటున్నారో వారికి ఇది సరైన మార్గం.
5.ఈక్విటీ పెట్లుబడులు
రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా లేదా నేరుగా ఈక్విటీలలోపెట్టుబడులు చేయవచ్చు. మొదటిసారిగా పెట్టుబడులు చేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టడం మేలు. వారి రిస్క్ తీసుకునే శాతాన్ని బట్టి ఈక్విటీ కేటాయింపులు ఉంటాయి. అయితే 20 నుంచి 25 శాతం వరకు పదవీ విరమణ నిధిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెడితే లాభాలను పొందవచ్చు.
6.మ్యూచువల్ ఫండ్లు
మ్యూచువల్ ఫండ్లు నిపుణులు నిర్వహణలో ఉండటంతో ఇవి చాలా సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగతంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని(ఎస్‌డబ్ల్యూపీ) ఎంచుకుంటేచ గడువు పెరిగినా కొద్ది ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకొని దీర్ఘకాలానికి మంచి లాభాలను అందిస్తాయి. సిప్‌లలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రెగ్యులర్‌గా పెట్టుబడులు పెట్టినట్లుగా, ఎస్‌డబ్ల్యూపీలో రెగ్యులర్‌గా విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది.
7.పీపీఎఫ్
పీపీఎఫ్ పెట్టుబడులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. 15 సంవత్సరాల గడువలో పెట్టుబడులు, వడ్డీ, మెచ్యూరిటీపై ఎలాంటి పన్ను లు వర్తించవు.
8.పన్ను రహిత బాండ్లు
మార్కెట్‌లో చాలా పన్ను రహిత బాండ్లు అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ నిధి కోసం పొదుపు చేస్తున్నవారికి కచ్చితమైన రాబడితో పాటు, పన్ను మినహాయింపు లబిస్తుంది. అయితే ఇందులో లిక్విడిటీ సదుపాయం తక్కవగా ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ ఎక్కువకాలం ఉంటుంది కాబట్టి, ఏదైనా అత్యవసర సమయంలో నిధిని తీసుకోవడం కష్టతరమవుతుంది. దీనిలో పెట్టుబడులకు కొంత ఆలోచించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
9.జాతీయ పింఛను విధానం
ఉద్యోగులు పదవీ విరమణ వరకు ఇందులో పెట్టుబడులు చేస్తే ఆ తర్వాత రెగ్యులర్‌గా పెన్షన్ పొందేందుకు వీలుంటుంది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా ఉపయోగిస్తారు. దీనిపై మరో రూ.50 వేల వరకు అదనంగా పన్ను మినహాయింపు ఉంటుంది.
10.యాన్యుటీ ప్లాన్స్
యాన్యుటీ ప్లాన్‌లు దీర్ఘకాలానికి సరిపడేవి. దీనిపై పన్ను వర్తిస్తుంది. ఇందులో ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించకుండా, రెగ్యులర్ చెల్లింపులకు అవకాశముంటుంది. యాన్యుటీ ప్లాన్‌లు రెండు రకాలు. డిఫర్‌డ్ యాన్యుటీ, ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్‌లు. డిఫర్డ్ యాన్యుటీలో ఒకేసారి ఎక్కవ మొత్తంలో లేదా రెగ్యులర్‌గా డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసని తర్వాత లేదా మెచ్యూరిటీ తర్వాత పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్‌లలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టవచ్చు. అప్పటినుంచి రెగ్యులర్‌గా పెన్షన్ లభిస్తుంది. పెట్టుబడి చేసిన మొత్తంలపై ఆధారపడి పెన్షన్ లభిస్తుంది.