వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Paytm ipo price) (పేటీఎం(Paytm) మాతృ సంస్థ) ఆరంభంలోనే డీలాపడింది. గురువారం ఈ సంస్థ లిస్టింగ్‌కు రాగా.. ఇష్యూ ధర (Paytm listing price) కంటే 9 శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేరు ఇష్యూ ధరను రూ.2,150గా (Paytm ipo price) నిర్ణయించారు. నేడు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 9.30 శాతం తక్కువగా రూ.1950తో లిస్ట్ అయ్యింది. బీఎస్‌ఈలోనూ 9 శాతం తగ్గి రూ.1,955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పేటీఎం షేర్లు మరింత కుంగి 23 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.1,670 వద్ద కొనసాగుతోంది. అయితే, షేర్ల ధర తగ్గినప్పటికీ.. కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు దాటడం విశేషం.
రూ.18,300కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం నిర్వహించిన ఐపీఓ (Paytm ipo) సబ్‌స్క్రిప్షన్‌కు మోస్తరు స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి. కేవలం భారత్‌లోనే కాదు.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీఓ. దీని కంటే ముందు మన దేశంలో 2010లో కోల్ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే (Paytm listing price) ఇప్పటి వరకు అతిపెద్దది.
వన్97కమ్యూనికేషన్స్‌ను 2000లో ప్రారంభించారు. తొలుత మొబైల్ టాప్-అప్‌లు, బిల్లు చెల్లింపుల సేవల్ని అందించేది. 2009లో డిజిటల్ చెల్లింపుల నిమిత్తం ప్రారంభించిన పేటీఎం మొబైల్ యాప్‌తో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. అనతికాలంలో దేశంలో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు ప్రధాన డిజిటల్ మాధ్యమంగా మారింది. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్లకు పైగా వినియోగదారులు, 21 మిలియన్లకు పైగా నమోదిత వ్యాపారులు ఉన్నారు. కంటర్ బ్రాండ్జ్ ఇండియా 2020 నివేదిక ప్రకారం.. పేటీఎం బ్రాండ్ విలువ 6.3 బిలియన్ డాలర్లు. ఏటా 114 మిలియన్ల మంది దీనిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: మీ ఫోన్‌తో ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోండిలా..