Paytm CEO Arrest: స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్‌కు వచ్చిన నాటి నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్న ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్టయిన విజయ్.. అదే రోజు బెయిల్‌పై విడుదల కావడం విశేషం. దక్షిణ దిల్లీ మాలవియా నగర్ ప్రాంతంలో గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
ఫిబ్రవరి 22న దిల్లీలోని అరబిందో మార్గ్‌లో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు.. డీసీపీ బెనితా మేరీ జైకర్ కారును ఢీకొట్టి, అనంతరం అతివేగంగా వెళ్లిపోయిందని దిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా తెలిపారు. అయితే ఆ సమయంలో డీసీపీ కారులో లేరని చెప్పారు. "డీసీపీ కారు డ్రైవర్ కానిస్టేబుల్ దీపక్ కుమార్.. ఇంధనం నింపడానికి కారును బయటకు తీసే సమయంలో ప్రమాదం జరిగింది. దీపక్ తన కారును ఢీకొట్టిన ల్యాండ్ రోవర్ నంబర్‌ను గుర్తించి.. వెంటనే డీసీపీకి సమాచారం అందించాడు. డీసీపీ సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీపక్" అని వివరించారు సుమన్.
అనంతరం ప్రాథమిక విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఆ కారు పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మదేనని నిర్ధరించుకున్నారు. అతివేగంగా కారు నడిపారనే ఆరోపణతో ఫిబ్రవరి 22న విజయ్ను అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయనను బెయిల్‌పై విడుదల చేసినట్లు నల్వా చెప్పారు.
ఇదీ చూడండి: అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టాలా? ఇది మీకోసమే..