ఇటీవల ముడి చమురు ధరల పెరుగుదలకు కారణమైన ఒపెక్ దేశాల మధ్య వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ఒపెక్ సభ్య దేశాలు ఆదివారం జరిగిన సమావేశంలో.. 'పూర్తి స్థాయి ఒప్పందానికి' ఆమోదం తెలిపినట్లు.. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇంధన మంత్రి తెలిపారు. అయితే ఒప్పందం గురించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. సౌదీ ఇంధన మంత్రి మాత్రం ఉత్పత్తి పరిమితి విషయంలో సర్దుబాటును సూచించినట్లు తెలిసింది.
చమురు ఉత్పత్తి పెంపు విషయంలో.. ఒపెక్‌లో కీలక దేశాలైన యూఏఈ, సౌదీ మధ్య గత నెల సమావేశంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి విషయంలో కొంత ఆందోళనకర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
గత సమావేశంలో ఇరు దేశాల వాదనలు ఇలా..
వచ్చే నెలతో పాటు ఈ ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకునేందుకు ఒపెక్, రష్యా సహా ఇతర చమురు ఎగుమతి దేశాలు ఇది వరకే (తాజా సమావేశం కాకుండ) రెండు సార్లు భేటీ అయ్యాయి. కానీ, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య దేశాలైన యూఏఈ, సౌదీ మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల వాయిదా పడింది. వచ్చే నెల చమురు ఉత్పత్తిని మరో 20 మిలియన్ బ్యారెళ్ల మేర పెంచాలని సౌదీ ప్రతిపాదించింది. అలాగే, గతంలో నిర్ణయించినట్లు 2022లోనూ ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగించాలని తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనల్లో వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తి పెంపునకు యూఏఈ అంగీకరించింది. కానీ, ఉత్పత్తిపై ఆంక్షల గడువు పొడిగింపునకు మాత్రం ససేమిరా అంది. దీనితో వివాదం నెలకొంది. అయితే తాజా సమావేశంలో ఈ ప్రతిష్టంభనకు తెరపడినట్లు తెలుస్తోంది.
శుక్రవారం నాటికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 73 డాలర్ల వద్ద ఉంది.