కొండెక్కిన ఉల్లి ధరలు దిగిరానంటున్నాయి. కేంద్రం దిగుమతులు పెంచి, ధర తగ్గించే చర్యలు చేపట్టినప్పటికీ.. కిలో ఉల్లి ధర రూ.165కు చేరింది. గోవాలో రూ.165, అండమాన్‌లో రూ.160, కేరళలో గరిష్ఠంగా రూ.150 రూపాయలకు ఉల్లి ధర చేరింది.
కొన్ని నగరాల్లో రూ.140 వరకు చేరిందని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో కిలో ఉల్లి రూ.120, దిల్లీలో రూ.100కు అమ్ముతున్నట్టు తెలిపింది.
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం... 21 వేల టన్నుల దిగుమతులను ఎమ్ఎమ్టీసీ ద్వారా చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వినియోగదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నిల్వలు జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
అకాల వర్షాలకుతోడు పంట ఉత్పత్తి తగ్గటమే ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి వస్తే... ఉల్లి ధరలు తగ్గే అవకాశముందని వ్యాపారులు, నిపుణుల చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఇకపై 24 గంటలూ నెఫ్ట్ లావాదేవీలు.. సెలవుల్లోనూ వాడొచ్చు