Omicron on Sputnik V: రెండు డోసుల స్పుత్నిక్ వి టీకాకు తోడు, ఒకే డోసు స్పుత్నిక్ లైట్ టీకాను 'బూస్టర్' కింద తీసుకుంటే కరోనా 'ఒమిక్రాన్' వేరియంట్ దరిచేరదని రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది. గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లేబొరేటరీ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. 'ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీ స్పందన స్పుత్నిక్ వితో లభిస్తోంది. స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోసు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితం ఉంటుంది. టీకా తీసుకున్న 2-3 నెలల తర్వాత 80 శాతం ప్రభావశీలత కనిపిస్తుంది' అని ఆర్‌డీఐఎఫ్ ట్విటర్‌లో వివరించింది. స్పుత్నిక్ లైట్ బూస్టర్ తీసుకున్న వారందరిలో 2- 3 నెలల్లో యాంటీ బాడీలు బాగా అభివృద్ధి చెందాయని పేర్కొంది.
Astrazeneca vaccine omicron
మరోవైపు, ఆస్ట్రాజెనెకాకు చెందిన 'ఎవుషెల్డ్' అనే యాంటీ-బాడీ మిశ్రమ ఔషధం, కరోనా వైరస్ 'ఒమిక్రాన్' వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవల్యూషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు స్వతంత్రంగా నిర్వహించిన ప్రాథమిక క్లినికల్ పరీక్షల్లో తేలింది. ఎవుషెల్డ్‌లో టిగ్జాజెవిమ్యాబ్, సిల్గావిమ్యాబ్ ఔషధాలు ఉన్నాయి. ఈ మందు ఒమిక్రాన్ వేరియంట్‌ను బలహీనపరుస్తోంది. రెండు మందులు కలిసి వైరస్ మీద దాడి చేసి, దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని గుర్తించారు.
కొవిడ్ కొత్త కొత్త వైరస్ వేరియంట్లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తికర ఫలితాలను ఈ ఔషధం కనబరుస్తోందని ఆస్ట్రాజెనెకాలోని బయోఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు మేన్ పాంగలోస్ పేర్కొన్నారు. ఎవుషెల్డ్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) ఉంది. మరికొన్ని దేశాల్లోనూ దీనికి గుర్తింపు లభించింది. ఈ ఔషధంపై ఇంకా ప్రయోగాలు కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొంది. త్వరలో ఈ పరీక్షల ఫలితాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.
ఇదీ చదవండి: