ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే రూ.499 చెల్లించి బుక్ చేసుకున్న కస్టమర్లు మిగతా మొత్తాన్ని చెల్లించి స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
నిజానికి గత వారమే అమ్మకాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించి వెబ్సైట్ పూర్తిగా సిద్ధమవనందున.. విక్రయాలను వారం పాటు వాయిదా వేసింది ఓలా ఎలక్ట్రిక్.
ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఈ-మెయిల్ పంపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. వారంతా కంపెనీ అధికారిక వెబ్సైట్, ఓలా యాప్ ద్వారా కొనుగోళ్లను పూర్తి చేయొచ్చని వెల్లడించింది.
బుకింగ్ ఇలా..
మీరు ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకుంటే.. మీ ఫోన్ నంబర్‌తో ఓలా ఎలక్ట్రిక్ వైబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్‌ను ఎంపిక చేసుకుని.. మిగతా మొత్తం చెల్లించి కొనుగోలును పూర్తి చేయొచ్చు. బుకింగ్ సమయంలో చేసుకున్న ఎంపికలను మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
కొత్తగా ఈ-స్కూటర్ కొనాలనుకుంటే.. రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు.
పేమెంట్: మీరు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి.. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,999 ఈఎంఐ ఆప్షన్‌తో.. ఫినాన్స్ సదుపాయం కూడా ఉంది. ఓలా 'ఎస్1 ప్రో' మోడల్‌కు ఈఎంఐ 3,199 నుంచి ప్రారంభమవుతుంది.
ఫినాన్స్ సదుపాయం కోసం.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా క్యాపిటల్ వంటి సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆయా సంస్థలు ఓలా, ఓలా ఎలక్ట్రిక్ యాప్‌ల ద్వారా అర్హులైన కస్టమర్లకు ఎస్1 మోడల్ కోసం తక్షణ రుణ సదుపాయం అందిస్తాయి.
మీకు ఫినాన్సింగ్ అవసరం లేదనకుంటే.. ఓలా ఎస్1 కోసం రూ. 20,000, ఓలా ఎస్1 ప్రో కోసం రూ.25,000 అడ్వాన్స్‌గా చెల్లించవచ్చు. మిగతా మొత్తాన్ని షిప్మెంట్ తేదీకి ముందు చెల్లించాలి. ఈ అడ్వాన్స్ మొత్తం రీఫండబుల్. అయితే ఇది షిప్మెంట్ కన్నా ముందు వరకు మాత్రమే.
కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. ఇక డెలివరీ కోసం వేచి చూడటమే. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. డెలివరీ సమయానికి కనీసం 72 గంటల ముందు సంబంధిత వివరాలు కస్టమర్‌కు పంపిచనుంది కంపెనీ.
ఓలా ఈ-స్కూటర్లు ఇవే..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రెండు ఈ-స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్. ఎస్1, ఎస్1 ప్రో పేర్లతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999గా నిర్ణయించింది. అయితే విద్యుత్ వాహనాలకు రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
ఇవీ చదవండి: