అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు పాలసీదారులతో పాటు వారి కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేలా 'నివ బూపా హెల్త్ ఇన్సూరెన్స్'(niva bupa health insurance) (గతంలో మ్యాక్స్ బూపాగా పిలిచేవారు) ఓ సరికొత్త వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని(Insurance policy) తీసుకొచ్చింది. పాలసీదారులు మరణించినా, శాశ్వత లేక పాక్షిక అంగవైకల్యానికి గురైనా ఈ పాలసీ వర్తిస్తుంది. ఎలాంటి భయం లేకుండా పాలసీదారులు తమ జీవితాన్ని గడిపేందుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చినట్లు నివ బూపా వెల్లడించింది. వార్షిక ఆదాయానికి 25 రెట్ల బీమా కవర్ ఉంటుంది. ప్రీమియం రూ.962 నుంచి ప్రారంభమవుతోంది. బీమా కవరేజీ రూ.5 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంది.
ఈ పాలసీలోని ఇతర ప్రయోజనాలు..
- టెంపరరీ టోటల్ డిసేబుల్‌మెంట్(టీటీడీ) బెనిఫిట్: ప్రమాదంలో పూర్తి అంగవైకల్యానికి గురైతే.. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రాథమిక ఇన్సూరెన్స్ హామీ మొత్తంలో రెండు శాతం సొమ్మును ప్రతివారం పరిహారంగా చెల్లిస్తారు. గరిష్ఠంగా వారానికి రూ.లక్ష వరకు అందజేస్తారు.
- నెలవారీ అవసరాలకు పరిహారం: ప్రమాదం సంభవించి కోమా లేదా పూర్తి శాశ్వత అంగవైకల్యం లేదా శాశ్వత పాక్షిక అంగవైకల్యానికి గురైతే నెలవారీ ఖర్చుల నిమిత్తం బేస్ కవరేజీలో 0.5 శాతం పరిహారంగా అందజేస్తారు. గరిష్ఠంగా రూ.50,000 వరకు చెల్లిస్తారు.
- చైల్డ్ సపోర్ట్ బెనిఫిట్: పాలసీదారుడు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా.. పిల్లల చదువు నిమిత్తం గరిష్ఠంగా రూ.5 లక్షలు, వివాహ ఖర్చులకు గరిష్ఠంగా రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఉద్యోగ నియామకాల్లో కూడా అండగా నిలుస్తారు.
- లోన్ ప్రొటెక్టర్: పాలసీదారులు మరణించినట్లైతే.. ఇంకా కట్టాల్సిన రుణ అసలుకు ఈ స్కీం ద్వారా రక్షణ లభిస్తుంది.
ఇదీ చదవండి: LIC: ఎల్‌ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి!