ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన వంద మంది ప్రపంచ శక్తిమంతమైన ప్రపంచ మహిళల జాబితాలో 41వ స్థానంలో నిలిచారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్నీ నాడార్ మల్హోత్రా 55వ స్థానంలో నిలవగా.. బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 68వ ర్యాంకు దక్కించుకున్నారు. లాండ్మార్క్ సంస్థల ఛైర్ఉమన్ రేణుకా జగ్తియాని 98వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
కమలకు 3వ స్థానం..
శక్తిమంతమైన మహిళల జాబితాలో అనూహ్యంగా చోటు సంపాదించారు ఇటీవల అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారీస్. ఇప్పటి వరకూ ఒక్కసారీ కూడా టాప్ 100లో లేని హారిస్ ఈ సారి మాత్రం మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
వరుసగా పదేళ్ల నుంచి మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చిన జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్.. ఈ సారి కూడా అగ్రస్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టినా లగార్డ్ వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ 2004 నుంచి ఏటా వందమంది శక్తిమంతమైన మహిళలను ఎంపిక చేసి వారి వివరాలను ప్రచురిస్తోంది.