వివిధ కారణాలతో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించడం మంచిది కాదని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. కొంతమంది డీమ్యాట్ ఖాతా కోసం ఒకటి, గృహ రుణాల కోసం మరొకటి. వేతన ఖాతా కోసం ఇంకొకటి.. ఇలా ఒక్కోదానికి ఒక్కో బ్యాంకు ఖాతా వినియోగిస్తుంటారు. ఇవి కాకుండా ఉద్యోగాలు మారినప్పుడు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభిస్తుంటారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేం. ఒకవేళ ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ ఖాతాలు ఉంటే..?
ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లో కొంత డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు బ్యాంకుల్లో కనీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఉండాలి. అంటే, మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లో ఉండిపోతుంది. ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకపోతే దానిని మూసివేయడమే మంచిది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా పొదుపు ఖాతాలపై ఇతర ఛార్జీలు, అంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా కనీస నిల్వలను నిర్వహించాల్సి ఉంటుంది. కనీస నిల్వ లేనప్పుడు బ్యాంకులు తగిన ఛార్జీలు కూడా విధిస్తాయి.
ఖాతాల నుంచి వరుసగా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం లావాదేవీలు చేయకపోతే దానిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. అప్పుడు ఖాతా నుంచి డెబిట్ కార్డ్, చెక్కులు, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఆ ఖాతాను యాక్టివేట్ చేసేందుకు రాతపూర్వకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతా అయితే ఖాతాదారులందరి సమ్మతి కావాలి. దీంతో ఆయా ఖాతాల్లో ఉన్న డబ్బులతో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం అన్ని పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది.
మరి ఏం చేయాలి?
బ్యాంకు ఖాతాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వేతన ఖాతా, కుటుంబ సభ్యులతో కలిపి ఉమ్మడి ఖాతా ఉంటే సరిపోతుంది. డబ్బు అత్యవసరం అయినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే ఇతర ఖాతాదారులు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. మరీ అంతగా కావాలనుకుంటే మరొక ఖాతాను శాశ్వత ఖాతాగా ఉంచుకోవచ్చు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారుతుంటాయి. పెట్టుబడుల కోసం శాశ్వత ఖాతాను ఉపయోగించాలి. దీంతో పాటు మీకు తెలియకుండానే ఇతర ఛార్జీలు చెల్లిస్తుంటారు. ఎన్ని ఖాతాలుంటే అన్ని కార్డులు ఉపయోగించాల్సి ఉంటుంది. కొత్త ఖాతా ప్రారంభించినప్పుడు అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది. వీలయితే ఉద్యోగం మారినా మీ శాశ్వత ఖాతాను వేతన ఖాతాగా చేయాలని కోరొచ్చు.
ఒక ఈపీఎఫ్ ఖాతాకు ఒక యూఏఎన్ ఇస్తారు. ఉద్యోగం మారినప్పుడు అదే యూఎన్‌తో ఖాతాలోని మొత్తాన్ని ఇతర సంస్థకు బదిలీ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్ వంటి పెట్టుబడులకు ఒకే ఖాతాను ఉపయోగించాలి. వేర్వేరు బ్యాంకులతో అనుసంధానం చేస్తే గందరగోళంగా ఉంటుంది. మీ ముఖ్యమైన, శాశ్వతంగా కొనసాగించే బ్యాంకు ఖాతాను వీటికి అనుసంధానం చేయాలి. ఉద్యోగం మారిప్పుడు కొత్త ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకొని పాత ఖాతాను మూసేయాలి.
ఆర్థిక జీవితానికి బ్యాంకు ఖాతా, పాన్, ఆధార్ చాలా కీలకమైన ఆధారాలు. పన్ను చెల్లింపుల నుంచి బిల్లు చెల్లింపులు, ఇతర ఏ పనికైనా పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా తప్పనిసరి. తక్కువ ఖాతాలు ఉంటే లావాదేవీలు, బ్యాంకు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు సులభంగా ఉంటుంది. రెండు లేదా మూడు చాలు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉండటం ఆర్థిక జీవనానికి సరైనది కాదని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతాను ఆన్‌లైన్‌లో మూసివేయడానికి చాలా వరకు బ్యాంకులు ఒప్పుకోవు. కాబట్టి, మీరు బ్యాంకుకు వెళ్లి వారు అందించిన 'క్లోజర్ ఫారం' నింపి, మీ డెబిట్/క్రెడిట్ కార్డు వంటివి తిరిగి ఇచ్చేసి బ్యాంకు ఖాతా ని మూసివేయాలని కోరవచ్చు.
ఇదీ చూడండి: పెట్రో పీడనకు సరైన విరుగుడు అప్పుడే!