రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ... ప్రపంచంలోనే ఐదో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ రియల్ టైమ్ బిలయనీర్స్ జాబితా ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం 75 బిలియన్ డాలర్లు (5.61 లక్షల కోట్లుగా ఉంది.)
రిలయన్స్ దూకుడు
బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ.2,010 (35 శాతం) గరిష్ఠ స్థాయిని చేరింది. దీనితో సంస్థ ఆదాయం 4.49 శాతం పెరిగింది. దానితో ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.70 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ లాభాల పంటతో ముఖేశ్ అంబానీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.
రుణరహిత సంస్థగా ఆర్ఐఎల్
రిలయన్స్ ఇండస్ట్రీని రుణరహితం సంస్థగా మార్చడమే లక్ష్యంగా ముఖేశ్ అంబానీ పావులు కదిపారు. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా జియో ప్లాట్‌ఫాంలోని వాటాలను ఫేస్బుక్, గూగుల్, క్వాల్కం వెంచర్స్ లాంటి బడా అంతర్జాతీయ సంస్థలకు విక్రయించారు. ఫలితంగా ఇప్పటికే ఆర్ఐఎల్ రుణరహిత సంస్థగా నిలిచింది.
అపర కుబేరులు
ప్రపంచంలోనే టాప్ 10 అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక ఆసియా వ్యక్తి ముఖేశ్ అంబానీ. కొన్ని రోజుల క్రితం ఆయన సంపద విషయంలో... బెర్క్‌షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్‌ను అధిగమించారు. అయితే బఫెట్ 2.9 బిలియన్ డాలర్ల సంపదను స్వచ్ఛంద సంస్థలకు దానం చేయడం వల్లనే ఇది సాధ్యమైంది.
ఇప్పుడు ముఖేశ్ అంబానీ కంటే ముందు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం జుకర్‌బర్గ్ ఆయన నికర ఆస్తుల విలువ 89 బిలియన్ డాలర్లుగా ఉంది.
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 185.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన బంగారం ధరలు