మొబైల్ ఫోన్లు, వాటికి సంబంధించిన పలు విడిభాగాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. దీనితో ఫోన్ల ధరలు మరింత ప్రియంకానున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 39వ సమావేశం నేడు జరిగింది. ఈ భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి సహా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నవీకరించిన జీఎస్టీఎన్ వ్యవస్థ.. 2020 జులై నాటికి అందుబాటులోకి రానున్నట్లు మండలి భేటీ అనంతరం సీతారామన్ తెలిపారు. జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు.. నైపుణ్యం ఉన్న సిబ్బంది, ఇతర వనరులను పెంచాలని ఇన్ఫోసిస్‌ను అడగనున్నట్లు ఆమె పేర్కొన్నారు.