'లైట్ వెయిట్ విండోస్ 10ఎక్స్' ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్)ను విడుదల చేయట్లేదని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. తొలుత 2021లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని భావించినప్పటికీ.. ఇతర ఉత్పత్తుల విస్తరణపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ సర్వీస్ హెడ్ జాన్ కేబుల్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సాంకేతికతల్లో భారీ మార్పులు రానున్నట్లు అంచనా వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రణాళికలు మారుతున్నట్లు జాన్ వివరించారు.
గూగుల్ ప్రణాళికలు..
నూతన ప్రైవసీ సెట్టింగులతో పాటు.. కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్ 12 బీటా వెర్షన్‌కి సంబంధించి కీలక ఫీచర్లను గూగుల్ ప్రకటించింది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. గూగుల్ పనివిధానంలో భారీ మార్పులు చేయనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు.
- మెరుగైన గోప్యత కోసం.. ఒక్క క్లిక్‌తో హిస్టరీని తొలగించేందుకు(15నిమిషాల) "క్విక్ డిలీట్" ఆప్షన్‌ను పరిచయం చేసింది గూగుల్. దీనికి రిమైండర్‌లనూ అందుబాటులోకి తేనుంది.
- "లాక్డ్ ఫోల్డర్" అనే మరో ఫీచర్‌తో గూగుల్ ఫొటోలకు మరింత రక్షణ కల్పించొచ్చని గూగుల్ పేర్కొంది. దీనితో.. ఎంపిక చేసిన ఫొటోలను విడిగా సేవ్ చేయవచ్చు. ఇతర ఆల్బమ్‌లను ఓపెన్ చేసినప్పుడు ఈ ఫొటోలు కనిపించవు.
- పాస్‌వర్డ్ నిర్వహణను సరికొత్తగా తీర్చిదిద్దింది గూగుల్. దీనితో వెబ్‌లో పాస్‌వర్డ్‌ల క్రియేట్ చేసుకోవచ్చు, గుర్తుంచుకోవచ్చు, సేవ్ చేయొచ్చు. అంతేగాక.. పాస్‌వర్డ్‌లను సులువుగా ఆటో-ఫిల్ చేయొచ్చు.
- ఆండ్రాయిడ్-12 మొదటి బీటా వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనుంది గూగుల్. 2014 తర్వాత డిజైన్ పరంగా అతిపెద్ద మార్పును చేసినట్లు సంస్థ ప్రకటించింది. తాజా వెర్షన్‌లో ఏయే అప్లికేషన్లు వినియోగదారుల డేటాను యాక్సెస్ చేస్తున్నాయో.. మరింత పారదర్శకంగా తెలుసుకునే ఫీచర్ ఉంటుందని తెలిపింది.
- దూరంగా ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్న భావన కలిగించే "ప్రాజెక్ట్ స్టార్‌లైన్"ను గూగుల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పిచాయ్ తెలిపారు.
- చర్మ వ్యాధులను సకాలంలో గుర్తించి.. కృత్రిమ మేధ సహాయంతో వాటిని నిరోధించేందుకు పరిశోధనలు చేపట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ఇవీ చదవండి: 'టెక్నాలజీ సాయంతో వ్యాపార రంగంలో సరికొత్త మార్పులు'