ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మెగా విలీన ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. అంతర్జాతీయంగా పోటీ ఇవ్వటం, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేసే ఉద్దేశంతో దేశంలోని 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేస్తున్నారు. ఆరు బ్యాంకులు 4 ప్రధాన బ్యాంకుల్లో విలీనం కానున్నాయి. నేటి నుంచి విలీనం చేసుకుంటున్న బ్యాంకుల పేరుతో సేవలు అందనున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారితో దేశంలో 21 రోజుల లాక్డౌన్ విధించిన క్రమంలో బ్యాంకుల విలీనం అమలులోకి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమయంలో బ్యాంకుల విలీనం అంత సులభంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే అలా ఉండదని బ్యాంకుల అధినేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
" ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం విలీనం జరుగుతుందనే నమ్మకముంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మేము సమీక్షించాం. విలీనం అమలులో పలు మార్పులు చేపట్టాం. ఉద్యోగులు, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేసాం. దానికి మేము భరోసా ఇస్తున్నాం. విలీనమవుతున్న బ్యాంకుల కోసం గతంలో ప్రతిపాదించిన రుణ ప్రక్రియ వంటి చర్యలను వాయిదా వేస్తున్నాం. కరోనా వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల కారణంగా పాత పద్ధతులనే అనుసరిస్తాం. పరిస్థితులు సద్దుమణిగే వరకు అవే కొనసాగిస్తాం. "
- రాజ్ కిరణ్ రాజ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ.
బ్యాంకుల విలీనం ఇలా..
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది.
- కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంకు విలీనం కానుంది. దీంతో కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
- యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనంతో యూనియన్ బ్యాంక్ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
- ఇండియన్ బ్యాంకులో.. అలహాబాద్ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనంతో దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.
12 బ్యాంకులు..
ప్రస్తుత విలీనంతో దేశంలో 7 అతిపెద్ద, 5 చిన్న స్థాయి బ్యాంకులు కలిపి మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సేవలందించనున్నాయి. ఈ విలీనంతో స్టేట్ బ్యాంకు తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అవతరించనుంది.
ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం..
గతేడాది దేనాబ్యాంకు, విజయ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసింది కేంద్రం. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనెర్ అండ్ జైపుర్, స్టేట్ బ్యాంక్ ఆప్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను మాతృ సంస్థలో కలిపింది. వాటితో పాటు భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసింది.
ఇదీ చూడండి: 100 నిమిషాలు, 100 ఎస్ఎంఎస్లు ఫ్రీ: జియో