ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతం దేశంవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో బ్యాంకుల విలీనానికి గడువు పెంచే అవకాశాలనున్నాయా? అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. బ్యాంకుల విలీనానికి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ అడ్డంకికాదని తెలిపారు. ఇప్పటికే ఈ నెల ఆరంభంలో బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు గుర్తి చేశారు.
బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా సాగుతుందని కొవిడ్-19 వల్ల కలిగే ఇబ్బందులను ఎగదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకింగ్ కార్యదర్శి దెబాశిశ్ పాండా తెలిపారు.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల మెగా విలీనాన్ని వాయిదా వేయాలని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విన్నివించింది.
బ్యాంకుల విలీనం ఇలా..
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలిపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది కేంద్రం.
- కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
- యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
- ఇండియన్ బ్యాంకులో.. అలహాబాద్ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.
బ్యాంకుల మెగా విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.
ఇదీ చూడండి:కేంద్రం సంక్షేమ యజ్ఞం- కష్టకాలంలో పేదలకు ఆపన్నహస్తం