దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వాహనాల ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరల పెంపు దిశగా యోచిస్తున్నట్లు సోమవారం పేర్కొంది.
'కొన్నేళ్లుగా ముడి పదార్థాల వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ఉత్పత్తి భారమవుతోంది. ఇలా పెరిగిన అదనపు భారంలో కొంత వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదు.' అని మారుతీ సుజుకీ వెల్లడించింది. అయితే ధరలు ఎంత పెరగొచ్చు అనే విషయంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది. త్వరలోనే మోడళ్ల వారీగా పెరిగే ధరల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే పలు మార్లు ధరల పెంపు..
ఈ ఏడాది ఇప్పటికే పలు మార్లు ధరలు పెంచింది మారుతీ సుజుకీ. ఏప్రిల్ 16న మోడళ్ల వారీగా.. సగటు ధర 1.6 శాతం పెరిగింది. జనవరి 18న ఎంపిక చేసిన మోడళ్లపై రూ.34 వేల వరకు ధర పెంచింది. అప్పుడు కూడా ముడి పదార్థాల వ్యయాల్లో వృద్ధి కారణంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది మారుతీ సుజుకీ.
పలు బడ్జెట్ మోడళ్లు అయిన ఆల్టో, ఎస్ క్రాస్ వంటి కార్ల ధరలు (ఎక్స్ షోరూం) ప్రస్తుతం.. రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షలుగా ఉన్నాయి. జులై, సెప్టెంబర్ మధ్య ఈ కనీస ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:పసిడి ధర పెరుగుతుందా? పెట్టుబడి పెట్టొచ్చా?