స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. కరోనా సంక్షోభంతో రికార్డు స్థాయిలో పతనమైన సూచీలు.. ఆ అవరోధాలను దాటుకుని తిరిగి సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.
సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ భారీగా 704 పాయింట్లు బలపడి.. 42,597 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 197 పాయింట్ల వృద్ధితో 12,461 వద్దకు చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవ్వడం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఫలితంగా దేశీయంగానూ లాభాలు నమోదయ్యాయి.
దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించటం కూడా లాభాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 42,645 (జీవనకాల గరిష్ఠం) పాయింట్ల అత్యధిక స్థాయి, 42,263 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 12,474 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 12,367 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఐటీసీ, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ లాభాలను నమోదు చేశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి స్వల్పంగా 7 పైసలు తగ్గింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 74.15 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:రాష్ట్రపతికి 15వ ఆర్థిక సంఘం తుది నివేదిక