నీరజ్ చోప్డాకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతి! - జావెలిన్ త్రో
ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన నీరజ్ చోప్డాకు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అదేంటంటే..

టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్డాకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్ వాహనాన్ని అతడికి బహుమతిగా ఇవ్వనున్నట్టు ట్విటర్ వేదికగా శనివారం వెల్లడించారు.

"మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి" అంటూ తొలుత ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన వెనక భారీ సైన్యంతో.. చేతిలో ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తున్న ప్రభాస్ ఫొటోతోపాటు.. ఈటెను విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన షేర్ చేశారు. ఆ ట్వీట్‌కు బదులిస్తూ నీరజ్‌కు ఎక్స్‌యూవీ700 బహుమతిగా ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను రితేశ్ జైన్ అనే వ్యక్తి కోరాడు. అతడి ట్వీట్‌కు బదులుగా.. ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్ చేశారు. తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులను ట్యాగ్ చేస్తూ.. నీరజ్ కోసం ఓ ఎక్స్‌యూవీ 700 మోడల్ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలంటూ అందులో పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఇతర భారతీయ క్రీడాకారులకూ పలు కంపెనీలు ఇలాగే వినూత్న బహుమతులను ప్రకటించడం విశేషం. రజతం సాధించిన ఆనందంలో పిజ్జా తినాలనుందంటూ తన కోరికను వెలిబుచ్చిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు డొమినోస్ కంపెనీ వెంటనే పిజ్జాలతో తన బృందాన్ని ఆమె వద్దకు పంపింది.
ఇదీ చూడండి: సింహాలతో ఆనంద్ మహీంద్ర సందేశం!