యుటిలిటీ వాహనాలకు దేశీయంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆటోమొబైల్ కంపెనీలు ఎస్యూవీ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కొత్త కొత్త మోడళ్లను ఈ సెగ్మెంట్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రేసులో హ్యుందాయ్, మహీంద్రా&మహీంద్రా ముందు వరుసలో ఉన్నాయి.
హ్యుందాయ్ అల్కాజర్ ఫస్ట్‌లుక్..
అల్కాజర్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించగా.. గురువారం దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. 6,7 సీటర్ అల్కాజర్‌ను ఈ నెలాఖరున మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
సరికొత్త ప్రీమియం అల్కాజర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. పెట్రోల్ వేరియంట్ 2 లీటర్ ఇంజిన్‌తో, డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ ఇంజిన్‌తో తేనుంది హ్యుందాయ్.
హ్యుందాయ్ అల్కాజర్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 500, ఇటీవల విడుదలైన టాటా సఫారీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.
ఈ నెలాఖరున మార్కెట్లోకి ఈ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేయనుంది హ్యుందాయ్.
ఎం&ఎం నుంచి ఎక్స్‌యూవీ 700..
మహీంద్రా & మహీంద్రా ఎస్యూవీ సెగ్మెంట్ అయిన ఎక్స్‌యూవీ పోర్ట్‌పోలియోలో మరో కొత్త మోడల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 500కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా.. ఎక్స్‌యూవీ 700 కారును.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విడుదల చేయనుంది.
భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎక్స్‌యూవీ 700ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.