బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీదారుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పాలసీదారులు కొవిడ్-19తో ఆసుపత్రిలో మరణించినప్పుడు.. మున్సిపల్ మరణ ధ్రువీకరణ స్థానంలో ప్రభుత్వ, ఈఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్పొరేట్ ఆసుపత్రులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ, డిశ్చార్జి సమ్మరీ, డెత్ సమ్మరీలో తేదీ, సమయంతో పాటు ఉన్న పత్రాలపై ఎల్ఐసీ క్లాస్ 1 ఆఫీసర్ సంతకం చేయించి, క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు దహనం/ఖననం జరిగిన చోట నుంచి ఇచ్చిన ధ్రువీకరణా చెల్లుతుంది. ఇతర మరణాలకు సంబంధించి మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ గతంలాగానే అవసరం ఉంటుంది.
వీడియోకాల్ ద్వారానూ..
పెట్టుబడి వెనక్కిచ్చే యాన్యుటీ పథకాలను ఎంచుకున్న వారికి అక్టోబరు 31 వరకు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిగతావారు ఇ-మెయిల్లో పంపాలి. వీడియోకాల్ ద్వారానూ ఈ ధ్రువీకరణను తీసుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. వ్యవధి తీరిన పాలసీల క్లెయింల కోసం సమీపంలోని ఎల్‌ఐసీ శాఖకు వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఎల్‌ఐసీ వెబ్ సైట్లో ఆన్లైన్ నెఫ్ట్కు సంబంధించిన వివరాలను తెలియజేసే వీలునూ కల్పించినట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి: దేశార్థికంపై కరోనా 2.0 ప్రభావం తక్కువే.. కానీ..