ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై- సెప్టెంబరు) ఐటీ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే మధ్యశ్రేణి కంపెనీలు బలమైన గణాంకాలు నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు పొందడంతో పాటు, డిజిటల్ సాంకేతికతలకు అవకాశాలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో వివిధ దేశాల్లో విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో సరఫరాపరమైన అవరోధాలు తొలగడం కూడా సమీక్షా త్రైమాసికంలో ఐటీ కంపెనీలకు కలిసి వచ్చిందని విశ్లేషిస్తున్నారు.
యాజమాన్యాల నుంచి సానుకూల సంకేతాలు
యాక్సెంచర్ యాజమాన్యం ఇటీవల చేసిన వ్యాఖ్యలు, హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం, ఎబిటా మార్జిన్ల అంచనాలను పెంచడం రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేస్తాయనడానికి సంకేతాలుగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వ్యయాల నియంత్రణ, ప్రయాణ ఖర్చులు తగ్గడం, కరెన్సీ మారకపు ప్రయోజనాలు లాంటివి కంపెనీల నిర్వహణ మార్జిన్లు మెరుగవడానికి తోడ్పడతాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇటీవల ఐటీ రంగ షేర్ల కదలికలను గమనిస్తే కూడా.. రెండో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయో ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్‌కు మించి ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఐటీ సూచీ రాణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 9 శాతమే పెరగ్గా, ఐటీ సూచీ 34.2 శాతం వరకు దూసుకెళ్లిందని చెబుతున్నారు.
మున్ముందు భారీగా ఆర్డర్ల రాక!
వివిధ కంపెనీలు సాంకేతికతపై వ్యయ కేటాయింపులు పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తుండటం, సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో మారుతున్న ధోరణులు ఐటీ కంపెనీలకు రానున్న రోజుల్లో భారీ ఆర్డర్లను తీసుకు రావొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ తన ఆదాయ అంచనాను 1-3 శాతానికి పెంచే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ భావిస్తోంది. మూడు, నాలుగు త్రైమాసికాలకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆదాయ వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని చెబుతోంది. ఒకవేళ.. యాజమాన్యం బలమైన విశ్వాసంతో ఆదాయ అంచనాలను పెంచితే అది మదుపర్లను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తే పరిణామమే అవుతుందని తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన వ్యయాలు
ఐటీ రంగంలో చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి విజయవంతంగా మారిపోయాయి. ఈ విధానం వల్ల వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగడమే కాకుండా కంపెనీల వ్యయాలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క్రాస్ కరెన్సీ కదలికలు కూడా కంపెనీల రెవెన్యూ పెరిగేందుకు దోహదం చేయొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే రూపాయి బలపడటం కొంత మేర ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని చెబుతున్నారు.