IREDA capital infusion: ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీలోకి (ఐఆర్‌ఈడీఏ) రూ.1,500 కోట్ల అదనపు ఈక్విటీ మూలధనం చొప్పించేందుకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పునరుత్పాదక ఇంధన సంస్థలకు ఈ సంస్థ రూ.12,000 కోట్ల మేర అదనంగా రుణాలివ్వగలుగుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.
Renewable energy loans India
అదనపు మూలధనంతో మరో 4,000 మెగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన రుణాలు అందించే అవకాశం ఐఆర్‌ఈడీఏకు లభించనుంది. ఆర్‌బీఐ రుణ నిబంధనల ప్రకారం, రుణ దాత నికర విలువలో 20 శాతం వరకు రుణాలు ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఐఆర్‌ఈడీఏ వద్ద ఉన్న రూ.3,000 కోట్ల మూలధనం కాస్తా రూ.4,500 కోట్లకు చేరడంతో పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) ప్రాజెక్టులకు రూ.900 కోట్ల వరకు రుణాలు అందించే అవకాశం లభించనుంది.
ఎస్‌బీఐకి రూ.974 కోట్లు
SBI loan moratorium ex gratia: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియం పథకానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఎస్‌బీఐ) రూ.974 కోట్లను కేంద్ర మంత్రి వర్గం కేటాయించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2020 మార్చిలో ప్రకటించిన రుణ మారటోరియం పథకం కింద, రుణ సంస్థలు సమర్పించిన క్లెయిమ్‌ల ఈ మొత్తాన్ని కేటాయించారు.
రుణ గ్రహీతలకు బారు వడ్డీ, చక్ర వడ్డీ మధ్య తేడాను ఎక్స్‌గ్రేషియాగా చెల్లించేందుకు రూ.5,500 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇందులో రూ.4,626.93 కోట్లను 2020-21లో చెల్లించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1,846 కోట్ల క్లెయిమ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 2021 జులై 23-సెప్టెంబరు 22 మధ్య ఎక్స్‌గ్రేషియా రీయంబర్స్‌మెంట్ కోసం రూ.837.07 కోట్లు ఎస్‌బీఐకి మంజూరు చేశారు. మిగిలిన బకాయిల కోసం కూడా కలిపి కేంద్ర మంత్రి వర్గం మొత్తం రూ.973.74 కోట్లు మంజూరు చేసిందని వివరించారు.
ఇదీ చదవండి: కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అనుమతి!