ఐఆర్సీటీసీతో బస్సు టికెట్లు ఇలా బుక్ చేసుకోండి.. - ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు
ప్రయాణాలకు ఒకే వేదిక కల్పించే దిశగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) మరో సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఆన్‌లైన్ ద్వారా బస్ బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసులను వినియోగించుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్‌లో బస్ టికెట్ల బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. ఈ బస్ టికెట్ల బుకింగ్ వెబ్‌సైట్ జనవరి 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. "కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ సారథ్యంలో ఐఆర్‌సీటీసీ వన్ స్టాప్ షాప్ ట్రావెల్ పోర్టల్‌గా అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల ప్రయాణాలకు ఒకే వేదికను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐఆర్‌సీటీసీలో ఇప్పటికే ఆన్‌లైన్ రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకొనే అవకాశముంది. అదే బాటలో జనవరి 29, 2021 నుంచి బస్ టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది" అని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సర్వీసులను ఫోన్లలో వినియోగించుకొనేందుకు ఐఆర్‌సీటీసీ యాప్‌లో తగిన మార్పులు చేస్తున్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు. మార్చి మొదటి వారంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇలా బుక్ చేసుకోవచ్చు..
ఈ ఆన్‌లైన్ బస్ టికెట్లు బుక్ చేసుకొనేందుకు https://www.bus.irctc.co.in/home వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇందులో టికెట్లు బుక్ చేసుకొనే ముందు బస్సు ఫొటోలు చూసుకొనే అవకాశం కూడా ఉంది. ఒకేసారి ఆరు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. బస్సు వెళ్లే మార్గం, రివ్యూలు, వసతులు అన్నీ చూసుకొని టికెట్టు బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ-వాలెట్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కేరళ, మరిన్ని ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి యాభైవేల రాష్ట్ర ప్రభుత్వాల బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడిలో భారత్ సూపర్: డబ్ల్యూహెచ్‌ఓ