IPOs in 2022: కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్ ఇష్యూలు 'తగ్గేదేలే' అన్నట్లుగా హోరెత్తించనున్నాయి. వచ్చే ఏడాది కోసం సుమారు రూ.2 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్లు) సమీకరణ లక్ష్యం కలిగిన పబ్లిక్ ఇష్యూలు సిద్ధంగా ఉన్నాయని కోటక్ మహీంద్రా కేపిటల్ నివేదిక పేర్కొంది. ఇందులో సెబీ ఆమోదం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కంపెనీల ఐపీఓల విలువ 15 బి.డాలర్లు (రూ.1,12,500 కోట్లు) కాగా, సెబీకి దరఖాస్తు చేసేందుకు సన్నద్ధమవుతున్న కంపెనీల ఐపీఓల విలువ 11 బి.డాలర్లు (రూ.82,500 కోట్లు) అని తెలిపింది.
- 2021లో ఇప్పటివరకు 65 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా సుమారు రూ.1.35 లక్షల కోట్లు (15.3 బి.డాలర్లు) సమీకరించాయి. పబ్లిక్ ఇష్యూ పరిమాణం సగటు రూ.2,000 కోట్లకు పెరిగింది. 2020లో పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.31,500 కోట్లు మాత్రమే సమీకరించాయి.
- గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పబ్లిక్ ఇష్యూలు సంఖ్య, నిధుల సమీకరణ విలువను కలిపినా.. 2021 కంటే తక్కువే.
- 2022లో కొత్త సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్తి, స్పెషాలిటీ రసాయనాల విభాగంలోని కంపెనీలు ఎక్కువగా పబ్లిక్ ఇష్యూలకు వచ్చే అవకాశం ఉంది.
- ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల రుసుం వసూళ్లు తొలిసారి 100 కోట్ల డాలర్లను మించాయి. 2020తో పోలిస్తే సుమారు 25 శాతం పెరిగాయి.
- ప్రస్తుత సంవత్సరం 11 నెలల్లో విలీనాలు- కొనుగోళ్ల లావాదేవీల విలువ 4 శాతం పెరిగి 11800 కోట్ల డాలర్లకు చేరింది. 2020లో ఇదే సమయంలో ఇది 114 బిలియన్ డాలర్లుగా ఉంది.
- దేశీయంగా 968 కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటల్ సంస్థలు 58.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే ఈ విలువ సుమారు 10 రెట్లు. అలాగే రిలయన్స్ రిటైల్, జియోలోకి వచ్చిన పెట్టుబడులు మినహాయిస్తే 2019, 2020లో పీఈలు పెట్టిన మొత్తం పెట్టుబడులతో పోలిస్తే కూడా 2021లో వచ్చిన పెట్టుబడులు ఎక్కువే.
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో స్నాప్‌డీల్
దిల్లీ: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌డీల్ తొలి పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ) వచ్చేందుకు అనుమతి కోరుతూ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు అంద చేసింది. రూ.1,250 కోట్ల తాజా షేర్ల విక్రయం సహా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో 3.07 కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటున్నట్లు సంస్థ పేర్కొన్నట్లు సమాచారం. మార్కెట్ వర్గాల ప్రకారం, ఈ సంస్థ విలువ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు తర్వాత 150-170 కోట్ల డాలర్లకు (సుమారు రూ.11,250-12,750 కోట్లు) చేరొచ్చని అంచనా.
ఈ సంస్థ వ్యవస్థాపకులు కునాల్ భల్, రోహిత్ భన్సాల్‌లు ఈ ఐపీఓలో తమ వాటాలను విక్రయించడం లేదు. ఓఎఫ్‌ఎస్‌లో స్టార్‌ఫిష్, వండర్‌ఫుల్ స్టార్స్, సిఖోయా క్యాపిటల్, కెన్నెత్ స్టువార్ట్ గ్లాస్, మైరైడ్ ఆపర్చునిటీస్ మాస్టర్ ఫండ్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డు, లారెంట్ అమౌయాల్, మైల్‌స్టోన్ ట్రస్టీషిప్ సర్వీసెస్‌లు తమ వాటాలు విక్రయిస్తాయని తెలుస్తోంది. కొత్తగా సమీకరించే నిధులతో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని, టెక్ మౌలిక వసతుల్ని పెంచుకుని వృద్ధి దిశగా అడుగులు వేయాలనుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, జేఎం ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ ఒక్క ఏడాదిలో అన్ని వేల కోట్ల పన్ను కట్టారా?