2021 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 12 అవతరించింది. అంతేగాక ఐఫోన్-12ప్రో, ఐఫోన్-12ప్రో మాక్స్‌లు అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ప్రపంచంలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయని కౌంటర్ పాయింట్ నివేదిక వెల్లడించింది. ఈ మూడు మోడళ్లు జనవరి-2021లో యాపిల్ అమ్మకాల్లో 71% వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక ఆశ్చర్యం కలిగించే రీతిలో రెండేళ్ల కిందటి మోడల్ ఐఫోన్-11 అత్యధికంగా అమ్మకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
ఐఫోన్-12 సీరీస్‌ను గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించింది యాపిల్. ఇది ఐఫోన్-11కు అప్‌డేట్ వెర్షన్. అంతేగాక 5జీ సాంకేతికతో తయారైంది. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఈ రెండు ఫీచర్లు సహాయపడినట్లు కౌంటర్ పాయింట్ అంచనా వేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 12-మినీ, ఐఫోన్-12, ఐఫోన్-12ప్రో, ఐఫోన్-12ప్రో మాక్స్ ఫోన్లున్నాయి.
యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ అమ్మకాలు సింహభాగం అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఐఫోన్-12ప్రో మాక్స్. ఇందుకు బలమైన నెట్వర్క్ క్యారియర్లు, 5జీకి ఉన్న డిమాండ్ ప్రధాన కారణమని కౌంటర్ పాయింట్ పేర్కొంది.
ఈ జాబితాలో రెడ్‌మీ 9ఎ, రెడ్‌మీ 9 వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు మోడళ్లు కలిపి జనవరిలో షోవోమి స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 25% వాటాను సాధించాయి. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ-ఎ21ఎస్ ఏడో స్థానంలో, శామ్‌సంగ్ గెలాక్సీ-ఎ31 తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఐఫోన్-12 మిని ఎనిమిదో స్థానంలో ఉంది.
''5జీ సాంకేతికతకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆ దిశగా నూతన మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో ఉత్తమ అమ్మకాల జాబితాలో తక్కువ ధర కలిగిన 5జీ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి.''
-మోనికా శర్మ, కౌంటర్ పాయింట్.
ఇవీ చదవండి: అదిరిన షియోమీ కొత్త ఫోన్.. ధర ఎంతంటే!