Investment Tips: పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలామంది నష్టం అనే మాటను ఏమాత్రం ఇష్టపడరు. పెట్టుబడి నిర్ణయాల్లో ఇదే కీలకం. పెట్టుబడులు అధికంగా పెట్టేవారు, ఫండ్ మేనేజర్లు నష్టం.. రాబడికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. కానీ, సాధారణ మదుపరులకు ఇది కాస్త కఠినమైన అంశమే. నష్టం లేకుండా మంచి రాబడిని సాధించలేం అనేది అర్థం చేసుకోవాలి. ఒక పథకానికి నష్టభయం ఉందంటే.. అది అధిక రాబడికి ఇచ్చేందుకూ వీలుంటుంది.
పెట్టుబడి పథకం తీరు ఆధారంగా రకరకాల నష్టభయాలుంటాయి. ఫండ్ మేనేజర్లు నష్టభయాన్ని బేరీజు వేసుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తారు. సాధారణ మదుపరులకు అంత అవగాహన ఉండదు. ముందే అనుకున్నట్లు నష్టభయం అధికంగా ఉంటే.. రాబడి వస్తుందనే భావనా అన్ని వేళలలో సరికాదు.
ఒకే తీరు పెట్టుబడి పథకాలకు ఒకే తరహా నష్టభయం ఉంటుందనే భావనా ఉంటుంది. దీనినీ సాధారణ సూత్రీకరణ చేయలేం. ప్రతి పథకానికీ వేర్వేరు పరిస్థితుల్లో.. అనేక నష్టభయాలు ఉంటాయి. సాధారణంగా ఫండ్ పథకాలను వాటి నష్టభయాల ఆధారంగా.. తక్కువ నష్టభయం, సాధారణం-మధ్యస్థం, మధ్యస్థం, మధ్యస్థం-అధికం, అధికం-మరీ అధికం అనే రకాలుగా విభజిస్తారు. దీనినే ఫండ్ రిస్కో మీటర్ అనీ పేర్కొంటారు. మార్కెట్ విలువ, హెచ్చుతగ్గులు, నగదుగా మార్చుకునే వీలు తదితర అంశాల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఈ రిస్కోమీటర్‌ను జాగ్రత్తగా గమనించాలి. మీ నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్లను ఎంపిక చేసుకోవడం మేలు.
హెచ్చుతగ్గుల్లో..
మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లవు. చాలామంది మదుపరులు మార్కెట్ పతనం అవుతుంటే.. పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, పెరుగుతుంటే మదుపు చేయడం చూస్తూనే ఉంటాం. ఇది దీర్ఘకాలంలో పెట్టుబడులకు నష్టం కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం అనే విషయాన్ని మదుపరులు అర్థం చేసుకోవాలి.
నష్టభయం, రాబడి ఆధారంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ప్రామాణిక సూచీకి మించి అధిక నష్టభయం ఉన్న పథకం హెచ్చుతగ్గుల్లోనూ మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని ఊహించని నష్టభయాలూ వస్తుంటాయి. వీటికీ సిద్ధంగా ఉండాలి. మంచి ప్రణాళిక, అవగాహనతోనే దీనిని గట్టెక్కి, మంచి లాభాలు ఆర్జించే వీలుంది.
- రాఘవ్ అయ్యర్, సీబీఓ, యాక్సిస్ ఏఎంసీ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: Digital payments: డిజిటల్ పేమెంట్స్‌లో జోరు- అగ్రగామి భారత్