దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఏప్రిల్ 15 తర్వాత అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.
"లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు విదేశాల్లోని భారతీయులు వచ్చేందుకు వేచి చూడాలి. అప్పుడే అంతర్జాతీయ విమానాలకు అనుమతి ఇస్తాం. ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ఆయా దేశాల్లో పరిస్థితిని పరిశీలించి విమాన రాకపోకలపై నిర్ణయం తీసుకుంటాం. "
- హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమానయాన మంత్రి
కరోనా నేపథ్యంలో 21 రోజుల పాటు భారత్లో లాక్డౌన్ విధించారు. డొమెస్టిక్ సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది కేంద్రం. కార్గో, వైద్య పరికరాల తరలింపు విమానాలు, హెలికాప్టర్ సేవలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది.
వెనక్కు పంపేందుకు అనుమతి..
అయితే..లాక్డౌన్ సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ పౌరులను భారత్ నుంచి తీసుకెళ్లేందుకు ఆ దేశాలకు కేంద్రం అనుమతించింది. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ పౌరులను వెనక్కు పంపేందుకు ఎయిర్ ఇండియా వాణిజ్యపరమైన సేవలందిస్తోంది.
గత కొన్ని వారాలుగా ప్రపంచంలోని కరోనా ప్రభావిత ప్రాంతాలనుంచి దేశ పౌరులను తరలించటంలో ఎయిర్ ఇండియా కీలక పాత్ర వహించింది. చైనాలోని వుహాన్, రోమ్ నుంచి భారతీయులను వెనక్కు తీసుకువచ్చింది.
ఇదీ చూడండి: కరోనాపై యుద్ధంలో 'మోదీ టీమ్' పని చేస్తుందిలా...