ఏ దేశమైనా ప్రగతి బాటలో పయనించాలంటే.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం.. మూడూ ఎంతో కీలకం. కానీ.. పారిశ్రామిక, సేవారంగాల్లో ఉన్నంత వేగంగా సాంకేతిక మార్పులు.. వ్యవసాయరంగానికి ఇంకా చేరువ కాలేదు. దేశంలో ఏటా వందలాది అంకురసంస్థలు సేవలందించేందుకు అందుబాటులోకి వస్తున్నా.. వాటిలో సాగువైపు దృష్టిసారించే అంకురాలు చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఇంటెల్లో ల్యాబ్స్ అనే స్టార్టప్.. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులందిస్తూ.. ప్రత్యేకత చాటుకుంటోంది.
సమయం ఆదా :
గుడ్‌గావ్ కేంద్రంగా నడుస్తున్న ఇంటెల్లో ల్యాబ్స్ అంకుర సంస్థను 2016లో మిలన్ శర్మ, నిశాంత్ మిశ్రా, హిమానిషా, దేవేంద్ర చందాని ఏర్పాటు చేశారు. అహర్నిశలు శ్రమించి పంట పండించే రైతుకు, కొనుగోలు చేసే వినియోగదారుడికి ఉపయోగపడేలా ఈ స్టార్టప్‌ను రూపొందించారు. అన్నదాతలకు, వ్యాపారవేత్తలకు విలువైన సమయం ఆదా చేస్తున్నారు.
వేగంగా..
రైతులు సహజంగా పంట ఉత్పత్తులు, కూరగాయాలు, పండ్లు, ఆకుకూరల్ని మార్కెట్లో విక్రయించేటప్పుడు గ్రేడ్లు నిర్ణయిస్తారు. సూపర్ మార్కెట్లకి అమ్మేటప్పుడు ఈ గ్రేడ్ల నిర్ణయమే కీలకం. ఆ సమయంలో రైతో.. వ్యాపారో ప్రతి పండు లేదా కూరగాయల్ని చూస్తూ గ్రేడ్లు ఇవ్వటం కష్టం. ఇప్పుడా పనిని చాలా చక్కగా, వేగంగా చేస్తోంది.. ఇంటెల్లో ల్యాబ్స్ రూపొందించిన ఇంటెల్లో ట్రాక్.
ఫొటో తీస్తే చాలు:
స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా ఎదురుగా ఉన్న ఉత్పత్తుల్ని ఫొటో తీస్తే చాలు.. అందులో ఏవేవి ఏ గ్రేడ్‌కు చెందుతాయో వెంటనే చెబుతుంది.. ఈ ఇంటెల్లో ట్రాక్. పండనివీ, పగిలినవీ, ముదిరినవీ, కుళ్లినవీ ఉంటే వేరు చేస్తోంది. ఆ రకంగా అటు రైతులూ, ఇటు వ్యాపారులూ ఎవరూ మోసపోకుండా ఈ స్టార్టప్ వారధిగా ఉపయోగపడుతోంది.
కృత్రిమ మేథతో..
40రకాల పండ్లు, కూరగాయల్ని విశ్లేషించగలిగేలా ఇంటెల్లో ల్యాబ్స్‌ను రూపొందించారు.. రూపకర్తలు. ఈ యాప్ కృత్రిమ మేథ సాంకేతికతతో పనిచేస్తోంది. వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు, ఉద్యాన శాస్త్రవేత్తలు తయారు చేసి ఇచ్చిన ప్రమాణాల ఆధారంగా ఈ సాఫ్ట్వేర్ తీర్చిదిద్దారు. పండ్లు, కూరగాయల్ని ఫొటో తీసి పంపగానే.. తన దగ్గర ఉన్న వివరాలతో క్షణాల్లో పోల్చి వాటిని గ్రేడింగ్ చేస్తోంది. నాణ్యమైన ఉత్పత్తుల్ని వేరు చేస్తోంది.
నాణ్యమైన సేవలతో..
దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ అంకురాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంటెల్లో ల్యాబ్స్.. రిలయన్స్ ఫ్రెష్, డోల్ వంటి ప్రముఖ సంస్థలకు సేవలందిస్తోంది. భారత్, చైనాతో పాటు పలు ఆగ్నేయాసియా దేశాల్లోని ప్రముఖ కిరాణా సంస్థల్ని ఖాతాదారులుగా మలుచుకుని నాణ్యమైన సేవలతో ఇంటెల్లో ల్యాబ్స్‌ను మరింత వేగంగా విస్తరించేందుకు మిలన్ శర్మ, నిశాంత్ మిశ్రా, హిమానిషా, దేవేంద్ర చందాని ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 57.29% మందికి ఇంటర్నెట్ కనెక్షన్లు