యాప్‌లో చేసే పోస్టులకు వచ్చే "లైక్స్" గోప్యంగా ఉంచేందుకు ప్రయోగాలు జరుపుతున్నట్లు ప్రకటించింది సామాజిక మాధ్యమాల దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్.
ఈ ఏడాది పలు దేశాల్లో యాప్ వినియోగదారుల లైక్‌లు బహిరంగంగా కనిపించడం, కనిపించకపోడవం పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేందుకు ఇన్‌స్టా కృషి చేస్తోంది. వచ్చే వారం ఈ పరీక్షలను అగ్రరాజ్యానికీ విస్తరిస్తున్నామని ప్రకటించారు ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరి.
పోస్ట్ చేసిన వారు మాత్రమే..
సెప్టెంబర్‌లో ఫేస్బుక్ అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రాం.. లైక్‌లను గోప్యంగా ఉండేలా చేస్తున్నట్లు ప్రకటన చేసింది. వీక్షకుల సంఖ్యను, లైక్‌ల సంఖ్యను పోస్ట్ చేసిన ఖాతాదారు మాత్రమే చూసేలా.. మిగతా వీక్షకులకు కనిపించకుండా దాచే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.
ట్విట్టర్ ప్రయోగం
సాధారణంగా ఒక పోస్ట్‌ను ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది ఇష్ట పడుతున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు యువత. ఇదివరకు ట్విట్టర్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. అయితే లైక్స్ కనిపించకోపోయేసరికి వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు తేలింది. అందుకే తిరిగి లైక్‌లు, రీట్వీట్లూ కనిపించేలా చేసింది. మరిప్పుడు ఇన్‌స్టా చేసే ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.