కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చమురుకు డిమాండ్ భారీగా తగ్గింది. పెట్రోల్, డీజీల్ వినియోగం 66 శాతం క్షీణించింది. విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతున్న కారణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) డిమాండ్ 90 శాతం మేర పడిపోయింది.
2019 ఏప్రిల్‌లో భారత్ 2.4 మిలియన్ టన్నుల పెట్రోల్, 7.3 మిలియన్ టన్నుల డీజీల్ వినియోగించింది. 6,45,000 టన్నుల ఇంధనాన్ని విమానయానానికి ఉపయోగించింది.
ప్రపంచ మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్‌లో గత మార్చి నెలలో ఇంధన వినియోగం దశాబ్ద కాలపు కనిష్ఠానికి పడిపోయింది. ఏప్రిల్‌లోనూ చమురు వినియోగం తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.
17 శాతం మేర పడిపోయిన వినియోగం..
డీజీల్, పెట్రోల్, విమాన ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం మార్చి నెలలో 17.79 శాతం తగ్గి 16.08 మిలియన్ టన్నులకు పడిపోయాయి.
భారత్‌లో డీజీల్ వాడకం ఎక్కువ. అయితే లాక్డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, ట్రక్కుల రవాణా తగ్గిన నేపథ్యంలో డీజిల్‌కు డిమాండ్ పడిపోయింది. 24.23 శాతం మేర డిమాండ్ పడిపోయి 5.65 మిలియన్ టన్నుల డీజిల్‌కు మాత్రమే ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. పెట్రోల్ అమ్మకాలు 16.37 శాతం తగ్గి 2.15 మిలియన్ టన్నులకు చేరాయి. మార్చి మధ్యలో విమాన ప్రయాణాలు నిలిచిపోయిన కారణంగా విమాన ఇంధన వినియోగం 32.4 శాతం తగ్గి 4,84,000 టన్నులకు పడిపోయింది.
వంటగ్యాస్‌కు పెరిగిన డిమాండ్..
వంటగ్యాస్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. మార్చి నెలలలో ఎల్పీజీ అమ్మకాల్లో 1.9 శాతం పెరుగుదల నమోదైంది. 2.3 మిలియన్ టన్నుల గ్యాస్ అమ్మకాలు జరిగాయి.
పెరిగిన నాఫ్తా వినియోగం..
విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే నాఫ్తా ఇంధన వినియోగం మార్చి నెలలో 15.7 శాతం పెరిగింది. 1.38 మిలియన్ టన్నుల నాఫ్తాను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వినియోగించాయి. అయితే పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో పారిశ్రామిక ఇంధన డిమాండ్ 10.4 శాతానికి తగ్గి 4,82,000కు పడిపోయింది. రహదారుల నిర్మాణంలో వినియోగించే బిటుమిన్ ఇంధన వినియోగం 41 శాతం శాతం తగ్గి 5,25,000 కు పడిపోయింది.
ఇదీ చూడండి: భారత్‌లో అపరకుబేరుడు మళ్లీ అంబానీయే