పండగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య దాదాపు రూ.58 వేల కోట్ల(8.3 బిలియన్ డాలర్ల) సేల్స్ జరిగినట్లు రీసెర్చ్ సంస్థ రెడ్స్టీర్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే 65 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని వెల్లడించింది.
7 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరుగుతాయని సీజన్‌కు ముందు రెడ్స్టీర్ అంచనా వేసింది. అయితే సునాయాసంగా అంచనాలను అధిగమించడం విశేషం.
దసరా, దీపావళి పండగల సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు పలు విడతలుగా ఫెస్టివ్ సేల్స్ నిర్వహించాయి. మొత్తం రూ.58 వేల కోట్ల అమ్మకాలలో రూ.29 వేల కోట్లు తొలి సీజన్లో నమోదైనట్లు రెడ్స్టీర్ నివేదిక పేర్కొంది. రెండో సీజన్లో రూ.8,700 కోట్లు, మూడో సీజన్లో రూ.9,700 కోట్ల అమ్మకాలు జరిగాయని వివరించింది. ఇందులో ఫ్లిప్‌కార్ట్(మింత్రాతో కలిపి), అమెజాన్ సంస్థల వాటా 88 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
"ఈ సంవత్సరం ఫెస్టివల్ సీజన్లో అమ్మకాల వృద్ధి భారీగా ఉంది. 7 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేశాం. మా అంచనాలు సునాయాసంగా బద్దలయ్యాయి. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో షాపింగ్‌కు వినియోగదారులు ఎంతగా అలవాటు పడ్డారో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి."
-మృగాంక్ గుట్గుటియా, రెడ్స్టీర్ డైరెక్టర్
అయితే ఫ్యాషన్ సంబంధిత వస్తువుల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 3 శాతం (16 నుంచి 13 శాతానికి) తగ్గినట్లు రెడ్స్టీర్ నివేదిక పేర్కొంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో వివాహాలు నిరాడంబరంగా జరగడం, ఇతర వేడుకలు లేకపోవడం వల్ల ఫ్యాషన్ ఉత్పత్తులపై ప్రభావం పడిందని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రం హోమ్ పెరిగిన నేపథ్యంలో ఇంటి ఫర్నిచర్ ఉత్పత్తుల విక్రయాలు అధికమయ్యాయని తెలిపింది.
ఫెస్టివ్ సీజన్లో కొనుగోళ్లు జరిపిన వినియోగదారులలో 4 కోట్ల మంది టైర్ 2 నగరాలకు చెందినవారని నివేదిక తెలిపింది. 46 శాతం మంది వినియోగదారులు ఫోన్ల ద్వారానే కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది.
మెట్రో కన్నా పట్టణాల్లోనే అధికంగా
మరోవైపు, పండగ సీజన్లో అమ్మకాలు 30-40 శాతం అధికమయ్యాయని ఆర్థిక సేవల సంస్థ బెర్న్‌స్టెయిన్ లెక్కగట్టింది. మొత్తంగా సంవత్సర వృద్ధి చూస్తే గతేడాదితో సమానంగా ఉందని తెలిపింది. కొనుగోళ్ల వృద్ధిలో టైర్ 3, 4 నగరాలు మెట్రో సిటీలను అధిగమించాయని పేర్కొంది. టైర్ 1, 2 నగరాల్లో ఇప్పటికే ఉన్న వినియోగదారులు అధికంగా కొనుగోళ్లు జరుపుతుండగా, టైర్ 3, 4 నగరాల్లో కొత్త కస్టమర్లు పెరుగుతున్నారని వెల్లడించింది.
అమ్మకాలలో ఫుట్‌వేర్, స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తులు తొలి స్థానంలో, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్(మొబైల్స్, ల్యాప్టాప్స్..) రెండో స్థానంలో ఉన్నట్లు బెర్న్ స్టెయిన్ స్పష్టం చేసింది. కిరాణా, హోం పర్సనల్ కేర్, హౌస్‌హోల్డ్ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగినట్లు లెక్క గట్టింది. కన్సూమర్ డ్యూరబుల్ గూడ్స్(టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్లు) అమ్మకాలు 165 శాతం పెరిగాయని తెలిపింది.
మరోవైపు క్యాష్ ఆన్ డెలివరీలు తగ్గుముఖం పట్టినట్లు బెర్న్ స్టెయిన్ వెల్లడించింది. కొవిడ్‌కు పూర్వం 65 శాతం ఉన్న క్యాష్ ఆన్ డెలివరీల సంఖ్య ఇప్పుడు 55 శాతానికి పరిమితమయ్యాయని పేర్కొంది. ఆన్లైన్ పేమెంట్లపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా అభివర్ణించింది.