భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సారథ్యంలో రూపుదిద్దుకున్న ఆకాశ్ క్షిపణి తయారీ కాంట్రాక్టుల్లో సింహభాగం ప్రైవేటు రంగ సంస్థలకు దక్కుతోందని రక్షణ పరిశోధ శాఖ కార్యదర్శి, డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. 'రక్షణ రంగంలో అవకాశాలు’ అనే అంశంపై టై గ్లోబల్ సదస్సులో ఆయన మాట్లాడారు. రూ.25,000- రూ.30,000 కోట్ల విలువైన ఆకాశ్ క్షిపణి ఆర్డర్‌లో 87% వాటా ప్రైవేటు సంస్థలదేనని సతీష్‌రెడ్డి వివరించారు. రక్షణ తయారీ కార్యకలాపాల్లో ప్రస్తుతం దాదాపు 2,000 పెద్ద, మధ్యతరహా సంస్థలు డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులు నిలిపివేసి వాటిని దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించిందని, ఇది దేశీయ సంస్థలకు అతిపెద్ద అవకాశమని అన్నారు. భారతదేశం ‘టెక్నాలజీ లీడర్’గా ఎదుగుతున్న దేశమని సతీష్‌రెడ్డి విశ్లేషించారు. డీఆర్‌డీఓ ఇకపై భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించటంపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో తయారీ కార్యలాపాలను దేశీయ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేపట్టాలనేది తమ ఉద్దేశమని అన్నారు. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల డిజైన్, అభివృద్ధి, తయారీనే కాకుండా పెద్దఎత్తున ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం ఆశిస్తోందని తెలిపారు.
పెద్దఎత్తున పరిశోధనలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఐడెక్స్’ వంటి కార్యక్రమాల వల్ల సైనిక బలగాలతో కలిసి పరిశ్రమలు పెద్దఎత్తున పరిశోధనలు నిర్వహించే అవకాశం వచ్చిందని ఫోర్జ్ యాక్సిలరేటర్ సీఈఓ- సహ వ్యవస్థాపకుడైన విష్ సహశ్రనామమ్ అన్నారు. ఐడెక్స్ ద్వారా పరిశోధనల్లో నిమగ్నమైన సంస్థలకు 1.5 కోట్ల వరకూ పెట్టుబడి లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రక్షణ బలగాలు చేపట్టిన 29 పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టేందుకు 2,000 సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు.
ఇదీ చదవండి: డీఆర్‌డీఓ ల్యాబ్‌ల మధ్య 'క్వాంటమ్' కమ్యూనికేషన్