ఆర్థిక వ్యవస్థలో సంఘటిత రంగమే ప్రధాన పాత్ర పోషించనుందని (SBI Report on Informal Sector) ఎస్‌బీఐ తన పరిశోధనలో వెల్లడించింది. అసంఘటిత రంగ వాటా గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. స్థూల విలువ జోడింపు (జీఏఏ) లేదా సంఘటిత జీడీపీలో సంఘటిత రంగ వాటా 2020-21లో 80 శాతానికి చేరగా.. అసంఘటిత రంగ వాటా 15-20 శాతానికి (SBI Report on Informal Sector) పడిపోయిందని తెలిపింది. 2017-18లో అసంఘటిత రంగ వాటా 52.4 శాతం కాగా.. 2011-12లో 53.9 శాతంగా ఉంది. దేశంలో డిజటలీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోశ్ తెలిపారు. నివేదికలోని వివరాలు ఇలా..
- 2016 నవంబరులో నోట్ల రద్దు తర్వాత చేపట్టిన పలు చర్యలు ఆర్థిక వ్యవస్థకు (SBI Report on Informal Sector) డిజిటల్ రూపును తీసుకొనివచ్చాయి. కొవిడ్-19 పరిణామాల అనంతరం ఆర్థిక వ్యవస్థలో సంఘటిత వాటా మరింతగా పెరిగింది. ఈ విషయంలో చాలా దేశాలతో పోలిస్తే అత్యంత వేగవంత రేటుతో భారత్ ముందుకు వెళ్తోంది.
- మొత్తం కార్మికుల్లో 93 శాతం వరకు అసంఘటిత రంగం నుంచే ఉండేవాళ్లు. నోట్ల రద్దు అనంతరం ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జీఎస్‌టీ రూపంలో ఈ రంగానికి రెండో దెబ్బ తగిలింది. ఇక కొవిడ్-19 పరిణామాలు ఈ రంగం వాటాను మరింతగా పడేశాయి.
- గత కొన్నేళ్లలో వివిధ మార్గాల్లో 13 లక్షల మంది సంఘటిత ఆర్థిక వ్యవస్థ కిందకు వచ్చారు. ఈ-శ్రమ్ పోర్టల్ కూడా ఇందుకు తోడ్పడిందని నివేదిక తెలిపింది.
- 2020-21లో వాస్తవ జీడీపీని రూ.135.15 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే కొవిడ్-19 ప్రతికూల పరిణామాల కారణంగా 2021-22లో అందులో 7 శాతాన్ని కోల్పోయిందని నివేదిక తెలిపింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం.. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్లు, ప్రసారసాధనాల రంగాల్లో అసంఘటిత రంగ వాటా 40 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 34%; ప్రజా నిర్వహణలో 16%; తయారీలో 20 శాతంగా నమోదైంది. అయితే ఆర్థిక సేవలు, బీమా, యుటిలిటీస్ రంగాలు దాదాపు 100 శాతం సంఘటిత రూపంలో ఉండేవి.
- కొవిడ్-19 అనంతరం సంఘటిత ఆర్థిక రంగం మరింతగా పెరిగింది. ప్రత్యక్ష నగదు బదిలీ లావాదేవీలు పెరగడం ఇందుకు దోహదం చేసింది. సంఘటిత యుటిలిటీ సేవలు కూడా 1 శాతం పెరిగాయి.
- నెలవారీ ఈపీఎఫ్‌ఓ గణాంకాలను ఉటంకిస్తూ 2017-18 నుంచి 2021 జులై నాటికి సుమారు 36.6 లక్షల ఉద్యోగాలు సంఘటిత రంగం కిందకు వచ్చాయని నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంఘటిత రంగంలోని ఉద్యోగుల సంఖ్య 2019-20 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అయితే 2018-19 స్థాయితో పోలిస్తే తక్కువగా నమోదుకావచ్చని పేర్కొంది.
- 2017-18 నుంచి వ్యవసాయ రంగం 20-25% సంఘటిత రూపంలోకి మారింది. కేసీసీ కార్డులు ఇందుకు తోడ్పడ్డాయి. ప్రస్తుతం అసంఘటిత వ్యవసాయ రంగం 70-75 శాతంగా ఉంది. గత కొన్నేళ్లుగా కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఒక్కో కార్డుపై అవుట్‌స్టాండింగ్ విలువ 2017-18లో రూ.96,578గా ఉండగా.. 2021-22లో రూ.70,838 పెరిగి రూ.1,67,416కి చేరింది. ప్రస్తుతం ఈ తరహా కార్డులు 6.5 కోట్ల వరకు ఉంటాయని, వీటి అధికారిక విలువ రూ.4.6 లక్షల కోట్లు అని నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో పెట్రోలు బంకుల వద్ద రూ.ఒక లక్ష కోట్ల విలువైన చెల్లింపులు ఇలా జరిగాయని వివరించింది.
ఇదీ చూడండి : ఈ ప్రక్రియ పూర్తి చేశారా? లేకపోతే పీఎఫ్ జమ కాదు!