ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిసెంబర్ 3న సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్ బ్రోకర్లు, వ్యాపారులపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి భారత ఐటీ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ముంబయి, కోల్‌కతా, కాన్పుర్, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు తెలిపింది. కృత్రిమ లాభ, నష్టాల కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలో రివర్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వివాదాస్పద పద్దతి ద్వారా పలు యోగ్యత లేని సంస్థలు దాదాపు రూ.3500 కోట్లకు పైగా లాభ, నష్టాలను పొందాయని ఐటీ విభాగం అంచనా వేసింది.
ఈ సోదాల్లో అధికారులు.. లెక్కల్లో నమోదు చేయని దాదాపు రూ.1.20 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చని.. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.