హుందాయ్ నుంచి వస్తున్న కొత్త తరం క్రెటా కారు విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 17 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. దీనిలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండనున్నాయని ఇప్పటికే ప్రకటించిన కంపెనీ.. మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. దీని బాడీ అత్యంత దృఢంగా ఉండనుందని తెలిపింది. ఎంత అంటే.. రాయిలా ఉంటుందట!
అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ బాడీ
దీనికి కారణం.. దాన్ని తయారు చేయడానికి వినియోగించిన మెటీరియలే అని సంస్థ తెలిపింది. సూపర్‌స్ట్రక్చర్’గా పిలుస్తున్న ఈ బాడీని 74.30 శాతం ‘అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్’తో తయారు చేసినట్లు వివరించింది. దాదాపు 12 టన్నుల బరువును.. ఇది తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. ఒక్క ఆఫ్రికన్ ఏనుగు బరువు 2.5 నుంచి 7 టన్నులు ఉంటుంది. ఈ లెక్కన ఈ కారు బాడీ.. రెండు ఏనుగుల్ని మోయగలదని చెప్పుకొచ్చింది. దీనికి మునుపటి తరం క్రెటా 4 స్టార్ రేటింగ్ పొందింది. మరి దీని రేటింగ్ ఎలా ఉండనుందో చూడాలి.
త్రీడీ సాంకేతికతో...
తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ తయారీ కేంద్రంలో ఇప్పటికే కొత్తతరం క్రెటా ఉత్పత్తి ప్రారంభమైంది. దీని తయారీ ప్రక్రియలో తొలిసారి ‘త్రీడీ స్కానింగ్ సాంకేతికత’ను వినియోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని సమాచారం. 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అమర్చినట్లు తెలుస్తోంది. టెస్లాలో ఇటువంటిదే అమర్చారు.
అదే ప్రత్యేక ఆకర్షణ
ఇక హుందాయ్ బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ యాప్, ఈసిమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.10లక్షల నుంచి రూ.17లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: మంచి నీళ్ల కన్నా చౌకగా ముడి చమురు!