రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్‌ను హైదరాబాద్ క్రెడాయ్ స్వాగతించింది. భవంతుల అనుమతులకు సంబంధించి ఈ సంస్కరణ ఎంతో విప్లవాత్మకమైనదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణరావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అభివర్ణించారు. క్రెడాయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్ తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. 2016లో టీఎస్ ఐపాస్ తీసుకొచ్చినప్పటి నుంచి టీఎస్ బీపాస్ కోసం ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిందని... దాని రూపకల్పనలో తాము కీలకపాత్ర పోషించినట్లు వారు వివరించారు.
నూతన భవంతులకు ఆన్‌లైన్ ద్వారా అన్ని రకాల అనుమతులు ఒకేసారి ఇచ్చే సింగిల్ విండో వ్యవస్థ... టీఎస్ బీపాస్ అందుబాటులోకి రావడం.. నిర్మాణ రంగానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లని పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. ఆరేడు నెలలు వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగితే కాని రాని అనుమతులు ఇప్పుడు... టీఎస్ బీపాస్‌తో బ్యూరోక్రాటిక్ అవరోధాలను అధిగమించి.. నిర్దేశిత 21 రోజుల్లో అనుమతులు మంజూరు అవుతాయన్నారు. సకాలంలో అనుమతులు రావడంతో... పెట్టుబడులు స్తంభించే అవకాశం ఉండదని... ఇందువల్ల గృహ కొనుగోలుదారులకు ధరలో కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది ప్రపంచలోనే అత్యున్నత సంస్కరణ అని... ఇలాంటిది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. తాము చేసిన వినతితో ప్రభుత్వంలో ఆలోచన వచ్చి ఇప్పటికి కార్యరూపం దాల్చిందన్నారు. కొవిడ్ కారణంగా నాలుగైదు నెలలు ఆలస్యమైందని... లేకుంటే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అందుబాటులోకి వచ్చి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్