మానవ జీవితం అనిశ్చితితో కూడుకున్నది. ఎప్పుడూ ఏ ముప్పు, ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. ఆధునిక జీవన శైలిలో అనిశ్చితి ఇంకా పెరిగిపోతోంది. కుటుంబ సభ్యులు మరణిస్తేనే తట్టుకోలేని కుటుంబాలు... వారికి ఆధారమైన వ్యక్తి మరణించినట్లైతే భవిష్యత్‌పై ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కుటుంబానికి అండగా నిలిచేది జీవిత బీమా.
ఒక వ్యక్తి మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. జీవిత బీమా ఉన్నట్లయితే ఈ ఆదాయానికి అనుగుణంగా తీసుకున్న బీమా మొత్తం కుటుంబానికి అందుతుంది. కుటుంబ పెద్ద మరణించినప్పటికీ.. బీమా వల్ల కుటుంబ సభ్యులు కొంత ధైర్యంగా జీవించవచ్చు. పిల్లల చదువులు, పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా గమనం మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు వీలవుతుంది.
ఎందుకు అవసరం?
వ్యక్తి మరణించినా ఆదాయానికి లోటు రాకుండా చూసుకోవటానికి జీవిత బీమాను ఉపయోగించుకోవాలి. మనం లేని సమయంలో కూడా రుణాలు, రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు లేని సమయంలో మీ కుటుంబం ఖర్చులతో పాటు ఈఎంఐ చెల్లించటంలో ఇబ్బంది పడుతుంది. మీరు నిర్ధేశించిన ఆర్థిక లక్ష్యాలు మీరు లేని సమయంలోనూ అందుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీరున్న సమయంలో ఉన్న లైఫ్ స్టైల్‌ను కుటుంబం కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ కుటుంబ ఆర్థిక ప్రణాళిక కొనసాగుతూ ఉండాలి. భారీ ఖర్చుతో కూడుకున్న పిల్లల చదువులు, పెళ్లిళ్లు తదితరాలు ఉంటాయి.
కుటుంబం మొత్తం తీసుకోవాలా?
- కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయినట్లయితే తప్పకుండా సరైన మొత్తంతో జీవిత బీమా తీసుకోవాలి. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలతో ఉన్న కుటుంబాన్ని తీసుకుంటే తల్లి తండ్రి సంపాదిస్తుంటారు. వీరిద్దరు బీమా తీసుకోవాలి. ఒక్క తండ్రి మాత్రమే సంపాదిస్తున్నట్లయితే ఆయన సరిపోయేంత మొత్తంతో పాలసీ తీసుకోవాలి.
- ఇంట్లో మహిళ గృహిణి అయినట్లయితే ఇంట్లో వంట, పనులు, పిల్లల ఆలనపాలన చూసుకుంటుంది. ఇందులో కూడా ఆర్థిక విలువ ఇమిడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బీమా తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
- పిల్లలకు చిన్న తనంలో ఆదాయం ఉండదు. కానీ పెద్దయ్యాక వారు కూడా కుటుంబ సంపాదనలో పాత్ర పోషిస్తారు. వీరి భవిష్యత్ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారి పేరు మీద జీవిత బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబంలో ఆధారపడి జీవించే వారి సంఖ్య, కుటుంబ జీవన శైలి, పిల్లల చదువుకు కావాల్సిన మొత్తం, పెట్టుబడి అవసరాలను దృష్టిలో తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా వార్షిక వేతనానికి పది రెట్లు మొత్తం బీమా అనేది ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఇతర అంశాలను కూడా కలపటం ద్వారా ఎక్కువ మొత్తం బీమా తీసుకోవటం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి- వాహన బీమా పరిహారం ఎలా లెక్కిస్తారో తెలుసా?